Telugu Gateway
Top Stories

దుమ్మురేపిన టాటామోటార్స్ షేర్లు

దుమ్మురేపిన టాటామోటార్స్ షేర్లు
X

భ‌విష్య‌త్ అంతా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలదే. దీనికి చాలా కార‌ణాలు ఉన్నాయి. పెరుగుతున్న ఇంథ‌న వ్యయాలు ఒక‌టి అయితే..కాలుష్య స‌మ‌స్య‌లు మరొక‌టి. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌తో కాలుష్యం పూర్తిగా త‌గ్గ‌టంతోపాటు పెట్రోల్, డీజిల్ వినియోగంపై భారం గ‌ణ‌నీయంగా త‌గ్గ‌నుంది. ఇప్ప‌టికే దేశంలోని అగ్ర‌శ్రేణి సంస్థలు అన్నీ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై ఫోక‌స్ పెట్టాయి. ఇందులో టాటా మోటార్స్ తోపాటు మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా వంటి దిగ్గ‌జ సంస్థ‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే మార్కెట్లోకి ఎల‌క్ట్రిక్ ద్విచిక్ర వాహ‌నాలు వ‌చ్చాయి. ఎల‌క్ట్రిక్ బ‌స్సులు కూడా వ‌చ్చాయి. ర‌క‌ర‌కాల కార్లు ఎంట్రీకి సిద్ధం అవుతున్నాయి. ఈ త‌రుణంలో దేశీయ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ షేర్లు బుధ‌వారం నాడు దుమ్మురేపాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఆ కంపెనీ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై ఫోక‌స్ చేయ‌టంతోపాటు..ఈ సంస్థ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల విభాగంలో ప్ర‌ముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ 7500 కోట్ల రూపాయ‌లు పెట్టుబ‌డి పెట్ట‌డానికి ముందుకు రావ‌టం మార్కెట్లో ఈ షేర్ల ర్యాలీకి దోహ‌ద‌ప‌డింది. 18 నెల‌ల వ్య‌వ‌ధిలో టీపీజీ గ్రూప్ ఈ పెట్టుబ‌డులు పెట్ట‌నుంద‌ని టాటా మోటార్స్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఒక్క రోజులోనే ఈ కంపెనీ షేర్లు 21 శాతం లాభంతో 509 రూపాయ‌ల వ‌ద్ద ముగిశాయి. మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే ఈ షేరు ధ‌ర 46 శాతం పెరిగింది. భార‌త్ లో క్ర‌మ‌క్ర‌మంగా వాహ‌న‌దారులు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు మ‌ళ్లుతున్నారు. టాటా మోటార్స్ కేవ‌లం వాహ‌నాల త‌యారీకే ప‌రిమితం కాకుండా.. ఈరంగానికి అవ‌స‌రం అయిన బ్యాట‌రీలు, ఛార్జింగ్ వంటి అంశాల‌పై కూడా ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టింది. దీంతో మ‌దుప‌ర్ల‌లో ఈ సంస్థ ప్ర‌ణాళిక‌పై గురికుదిరి భారీ ఎత్తున కొనుగోళ్ళు చేస్తున్నారు.

కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ టాటా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను భార‌తీయ టెస్లా కార్ల‌గా అభివ‌ర్ణించ‌టం విశేషం. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ పోర్ట్ ఫోలియోను విస్తరిస్తోంది. అందులో భాగంగానే భవిష్యత్‌లో లాంచ్ చేయబోయే ఎలక్ట్రిక్ కార్లలో టియాగో హ్యాచ్ బ్యాక్ కారు ఒకటి అని సమాచారం. టాటా టియాగో గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని మార్పులతో మినహా అదేవిధంగా టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును త్వరలో మార్కెట్లోకి తీసుకొని రావాలని చూస్తోంది. దీని ధర ₹6.5 లక్షలకు సమీపంలో ఉంటుందని అంచనా. దీంతోపాటు ఆల్ట్రోజ్ హ్యాచ్ బ్యాక్ ఎలక్ట్రిక్ కారును ఈ ఏడాది చివరలో తీసుకొనిరావాలి చూస్తున్నట్లు ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ ఈవి స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది. ఏది ఏమైనా, టాటా ఆల్ట్రోజ్ ఈవి కూడా కంపెనీ జిప్ట్రాన్ పవర్ ట్రైన్ టెక్నాలజీతో రావచ్చు అని చెప్పొచ్చు. ఈ రాబోయే ఈవి బ్యాటరీ కారు 250 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ గతంలో తెలిపింది. టాటా ఆల్ట్రోజ్ ఈవీ ధర ₹10.5 లక్షల నుంచి ₹12.5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Next Story
Share it