టాటా క్యాపిటల్ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఫిక్స్

దేశీయ స్టాక్ మార్కెట్ లోకి మరో భారీ ఐపీవో రానుంది. అది కూడా టాటా గ్రూప్ నుంచి. 2023 లో టాటా టెక్నాలజీస్ ఐపీవో రాగా..ఇప్పుడు టాటా కాపిటల్ పబ్లిక్ ఇష్యూ ద్వారా మార్కెట్ నుంచి 15512 కోట్ల రూపాయలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీవో అక్టోబర్ 6 న మొదలై...8 వ తేదీన క్లోజ్ అవుతుంది. టాటా కాపిటల్ షేర్ల ప్రైస్ బ్యాండ్ ను 310 -326 రూపాయలుగా నిర్ణయించారు. ఈ షేర్లు స్టాక్ మార్కెట్ లో అక్టోబర్ 13 న నమోదు అయ్యే అవకాశం ఉంది. ఐపీవో లో భాగంగా కంపెనీ మొత్తం 47.58 కోట్ల షేర్లను జారీ చేయనుంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద 26 .58 కోట్ల షేర్లను..ఫ్రెష్ ఇష్యూ కింద 21 కోట్ల షేర్లను జారీ చేయనుంది.
ఈ ఐపీవో లో రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్లు కేటాయించారు. 50 శాతం షేర్లను అర్హత గల సంస్థాగత ఇన్వెస్టర్లకు, మిగిలిన పదిహేను శాతం షేర్లను నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించారు. ఈ కంపెనీ 2024 -2025 ఆర్థిక సంవత్సరంలో 3655 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇదే కాలంలో ఆదాయం 28313 కోట్ల రూపాయలుగా ఉంది. 2007 లో కార్యకలాపాలు ప్రారంభించిన టాటా క్యాపిటల్ 2025 మార్చి నాటికీ వివిధ విభాగాల్లో 70 లక్షల మందికి రుణాలు అందించింది. ఐపీవో ద్వారా సమీకరించే నిధులను కంపెనీ ముఖ్యంగా టయర్ వన్ క్యాపిటల్ తో పాటు భవిష్యత్ మూలధన అవసరాలు..బ్యాలన్స్ షీట్ ను మరింత బలోపేతం చేసుకునేందుకు ఉపయోగించనుంది.
ఇది ఇలా ఉంటే లిస్ట్ కాని టాటా క్యాపిటల్ షేర్ల ధరలు ఒక దశలో ఏకంగా 1125 రూపాయలకు కూడా చేరాయి. అధిక ధరల వద్ద కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు ఇప్పుడు లబోదిబో మంటున్నారు. టాటా గ్రూప్ ఇమేజ్...కంపెనీ ఫండమెంటల్స్ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది అన్ లిస్టెడ్ షేర్లను అధిక ధరల వద్ద కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ గరిష్ట ధరను 326 రూపాయలుగా నిర్ణయించటంతో అవాక్కు అవటం వాళ్ళ వంతు అయింది. అన్ లిస్టెడ్ మార్కెట్ లో ఈ కంపెనీ షేర్లు ట్రేడ్ అయిన చివరి ధర కూడా 735 రూపాయలు ఉంది. ఇలా చూసుకున్నా కూడా ఐపీవో ధర తో పోలిస్తే వీళ్ళు భారీగానే నష్టపోయినట్లు అయింది. అయితే దీర్ఘకాలం వేచిచూసే ఇన్వెస్టర్లకు మాత్రం టాటా క్యాపిటల్ ఐపీవో ఒక మంచి ఛాన్స్ గా మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి.



