గవర్నర్ నిర్ణయమే తరువాయి

తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ కు తెరపడింది. టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి కావటానికి మార్గం సుమగం అయింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినా కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల బలం చూపిస్తేనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించుతాను అంటూ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్ తేల్చిచెప్పడంతో గత రెండు రోజులుగా అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఒక వైపు విజయ్ ప్రమాణస్వీకారానికి గవర్నర్ నో చెప్పటం మరో వైపు...తమిళ రాజకీయాల్లో చిరకాల ప్రత్యర్ధులు అయిన డీఎంకే, ఏఐఏడీఎంకె లు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలు సాగిస్తున్నాయి అనే వార్తలు రావటం తమిళ రాజకీయాల్లో వేడి రాజేసింది. కొంత మంది నాయకులు కూడా ఇదే తరహా ప్రకటనలు చేయటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.
అయితే ఇటీవల వరకు డీఎంకే మిత్రపక్షాలుగా సిపిఐ, సిపిఎం తో పాటు వీసీకే లు విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని శుక్రవారం నాడు నిర్ణయం తీసుకోవటంతో గత రెండు రోజులుగా కొనసాగుతున్న పొలిటికల్ సస్పెన్సు కు తెరపడింది. ఈ పార్టీల మద్దతుతో విజయ్ కు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం అయిన 118 మంది ఎమ్మెల్యేల బలం చేకూరినట్లు అయింది. కాంగ్రెస్ కు తోడు మరో మూడు పార్టీలు మద్దతు ప్రకటించటంతో వీరి మద్దతు లేఖలతో విజయ్ మరో సారి గవర్నర్ తో సమావేశం అయి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాల్సింది కోరనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం అయిన మెజారిటీ సమకూరంతో టీవీకే క్యాడర్ సంబరాల్లో మునిగితేలుతున్నారు.



