Telugu Gateway
Top Stories

ఆప్ఘ‌నిస్తాన్ ను వీడిన అమెరికా..సంబ‌రాల్లో తాలిబ‌న్లు

ఆప్ఘ‌నిస్తాన్ ను వీడిన అమెరికా..సంబ‌రాల్లో తాలిబ‌న్లు
X

ఆప్ఘ‌నిస్తాన్ నుంచి అమెరికా ఖాళీ చేసి వెళ్లిపోయింది. అక్క‌డ నుంచి త‌మ ద‌ళాల‌ను పూర్తిగా ఉప‌సంహ‌రించుకుంది. దీంతో ఇర‌వై సంవ‌త్స‌రాలుగా ఉన్న అమెరికా సైనికులు పూర్తిగా వైదొల‌గిపోయారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లుగానే ఆగ‌స్టు 31 నాటికే అమెరికా త‌న ద‌ళాల‌ను పూర్తిగా ఉప‌సంహ‌రించుకుంది. అయితే ఆప్ఘ‌నిస్తాన్ ఇప్పుడు తీవ్ర స‌మస్య‌ల్లో చిక్కుకుపోయింది. అమెరికా ద‌ళాలు పూర్తిగా వైదొల‌గ‌టంతో అక్క‌డి ప్ర‌జ‌లు మ‌రింత బిక్కుబిక్కుమంటూ బ‌త‌కాల్సిన ప‌రిస్థితి. ఇప్పుడు ఆప్ఘ‌నిస్తాన్ పూర్తిగా తాలిబ‌న్ల చేతిలో ఉన్న‌ట్లు అయింది. ఇప్ప‌టికే వీరి ఆగ‌డాల‌కు అక్క‌డి ప్ర‌జ‌లు బ‌లి అవుతున్నారు. అమెరికా సైనికులు, పౌరుల‌తో కూడిన చివ‌రి విమానం సోమ‌వారం అర్ధ‌రాత్రి త‌ర్వాత కాబూల్ లోని హ‌మిద్ క‌ర్జాయ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి బ‌య‌లుదేరి వెళ్లింది. అమెరికా సెంట్ర‌ల్ క‌మాండ్ హెడ్ జ‌న‌ర‌ల్ మెకంజీ పెంట‌గాన్ లో ఈ విష‌యాన్ని నిర్ధారించారు. ఆప్ఘ‌నిస్తాన్ నుంచి అమెరికా ద‌ళాలు పూర్తిగా వెళ్ళిపోవ‌టంతో తాలిబ‌న్లు గాల్లోకి కాల్పులు జ‌రిపి సంబరాలు చేసుకున్నారు. తాలిబ‌న్ల‌తో త‌మ‌కు శ‌త్రుత్వం ఉన్నా కూడా త‌మ పౌరులు..ద‌ళాల త‌ర‌లింపున‌కు పూర్తిగా స‌హ‌క‌రించార‌ని అమెరికా ప్ర‌తినిధి వ్యాఖ్యానించ‌టం విశేషం. గ‌త కొంత కాలంగా ఆప్ఘ‌నిస్తాన్ ను వీడేందుకు అక్క‌డి విమానాశ్ర‌యం నిండా ప్ర‌జ‌లు గుమిగూడిన విష‌యం తెలిసిందే. అక్క‌డ తీవ్ర‌వాదులు దాడులు చేయ‌టం..అందులో వంద‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు, సైనికులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇదిలా ఉంటే దౌత్య సంబంధాల‌కు సంబంధించి అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

ఇక నుంచి దౌత్య సంబంధాలను ఖతార్‌ నుంచి నిర్వహిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ అన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ.. ''మిలిటరీ ఆపరేషన్‌ ముగిసింది. ఇక డిప్లొమాటిక్‌ మిషన్‌ మొదలుకానుంది. అమెరికా- అఫ్గనిస్తాన్‌ సరికొత్త అధ్యాయం ప్రారంభంకానుంది'' అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక మానవతా దృక్పథంతో అఫ్గన్‌ ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటామని బ్లింకెన్‌ స్పష్టం చేశారు. తాలిబన్‌ ప్రభుత్వం ద్వారా కాకుండా, ఐక్యరాజ్యసమితి, ఎన్జీవోల వంటి స్వతంత్ర స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ సహాయం అందుతుందని పేర్కొన్నారు. అదే విధంగా... అఫ్గన్‌ను వీడాలనుకున్న ప్రతి అమెరికన్‌, అఫ్గన్‌, ఇతర పౌరులను సురక్షితంగా తరలించామని తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణాలపై తాలిబన్లు ఆంక్షలు విధించవద్దని, మహిళలు, మైనార్టీ హక్కులను కాలరాసేలా వ్యవహరించకూడదని హితవు పలికారు. అలాగే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే చర్యలకు తావివ్వకూడదని విజ్ఞప్తి చేశారు.

Next Story
Share it