Telugu Gateway
Top Stories

నుపుర్ శ‌ర్మ‌పై సుప్రీం ఫైర్

నుపుర్ శ‌ర్మ‌పై సుప్రీం ఫైర్
X

బిజెపి మాజీ అధికార ప్ర‌తినిధి నుపుర్ శ‌ర్మ‌పై సుప్రీంకోర్టు ధ‌ర్మాసనం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆమె వెంట‌నే మీడియా వేదిక‌గా దేశ ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ క్షమాప‌ణ చెప్పాల‌ని ఆదేశించారు. అంతే కాదు..ఈ చ‌ర్చ‌ను నిర్వ‌హించిన ఛాన‌ల్ యాంక‌ర్ పైన కూడా కేసు న‌మోదు చేసి ఉండాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డింది. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్తపై ఓ చాన‌ల్ లో నుపుర్ శ‌ర్మ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన వ్య‌వ‌హ‌రం పెద్ద దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై యూఈఏ దేశాలు భార‌త్ కు ఈ విష‌యంలో తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశాయి. ఈ ప‌రిణామాల‌తో బిజెపి అధిష్టానం ఆమెను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. తనకు ప్రాణహాని ఉంద‌ని, అత్యాచార బెదిరింపుల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా తనకు వ్యతిరేకంగా దాఖలైన కేసుల ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగిన సంద‌ర్భంగా ఆమెపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌..సుప్రీం ఆమె పిటీష‌న్లు అన్నింటిని తిర‌స్క‌రించింది. అధికారం ఉందనే పొగరు తలకెక్కి నూపుర్‌ శర్మ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని కోర్టు వ్యాఖ్యానించింది.

'ఆమె నోటి దురుసు.. దేశం మొత్తంలో మంటపెట్టింది. రావణ కాష్టాన్ని రగిల్చింది. నూపుర్‌ శర్మ వ్యాఖ్యల వల్లే ఉదయ్‌పూర్‌ ఘటన కూడా జరిగింది. ఆమె యావత్‌ దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందే' అంటూ వ్యాఖ్యానించింది బెంచ్‌. ఒక అజెండాను ప్రచారం చేయడం తప్ప.. టీవీ ఛానెల్, నూపుర్ శర్మల చర్చ వల్ల ఒరిగింది ఏమిటి? అని సూటిగా ఆమె తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఆమె తరపున సీనియర్‌ అడ్వొకేట్‌ మణిందర్‌ సింగ్‌ సమాధానమిస్తూ.. ప్రవక్త వ్యాఖ్యలపై ఆమె ఇప్పటికే క్షమాపణలు చెప్పారని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని చెప్పారు. అయితే.. ఆమె టీవీ ముందుకు వచ్చి యావత్‌ దేశానికి క్షమాపణలు చెప్పాల్సి ఉందని, అప్పటికే ఆలస్యం అయ్యిందని సుప్రీం తెలిపింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని నూపుర్ శర్మ తరఫు న్యాయవాది సుప్రీం కోర్టులో చెప్పగా.. జస్టిస్ సూర్యకాంత్ కలగజేసుకుని.. ఆమెకు ముప్పు ఏర్పడిందా? ఆమె వల్ల దేశం రగిలిపోతోంది అంటూ మండిపడ్డారు. దేశమంతటా భావోద్వేగాలను ఆమె రగిలించిన విధానం, దేశంలో జరుగుతున్న ఘటనలకు ఆమెదే బాధ్యత అని ఆయన అన్నారు.

ఫిర్యాదు నమోదు అయిన తర్వాత ఢిల్లీ పోలీసులు ఏం చేశారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఆమె ఫిర్యాదు మీద ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. మరి ఆమెపై ఎన్నో ఎఫ్‌ఐఆర్‌లు అందినా.. ఎందుకు ఆమెను టచ్‌ చేయలేకపోయారు అని ఢిల్లీ పోలీసులను సుప్రీం కోర్టు ప్ర‌శ్నించింది. ఆమె అహంకారంతో మాట్లాడింది. మీలాంటి వ్యక్తులకు ఏ మతం మీద గౌరవం లేదని.. ఆ వ్యాఖ్యలతో అర్థమవుతోంది. నోటి దురుసుతనంతో.. అధికారం ఉందనే తలపొగరుతో ఆమె చేసిన వ్యాఖ్యలు.. దేశ భద్రతకు ముప్పు తెచ్చి పెట్టాయి. ఆమెది సరిదిద్దుకోలేని పొరపాటని బెంచ్‌ అభిప్రాయపడింది. దేశ భద్రతకు ముప్పు తెచ్చింది నూపుర్‌ శర్మనేనని వ్యాఖ్యానించింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ.. ఈ కేసులో సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని నూపుర్ శర్మ తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది.

Next Story
Share it