Telugu Gateway
Top Stories

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌లో భ‌ద్ర‌తా వైఫ‌ల్యం..స్వ‌తంత్ర విచార‌ణ‌

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌లో భ‌ద్ర‌తా వైఫ‌ల్యం..స్వ‌తంత్ర విచార‌ణ‌
X

సుప్రీంకోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పంజాబ్ లో జ‌రిగిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ భ‌ద్ర‌తా ఉల్లంఘ‌ట‌న ఘ‌ట‌న‌కు సంబంధించి స్వ‌తంత్ర క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. అదే స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల విచార‌ణ‌ను నిలిపివేయాల‌ని ఆదేశించారు. సోమ‌వారం నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్, పంజాబ్ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఇరు వైపుల వాదనలు విన్న ధర్మాసనం.. భద్రతా లోపంపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో విచారణ కమిటి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సుప్రీం కోర్టు ప్రతిపాదనపై కేంద్ర సొలిసిటర్‌ జనరల్‌, పంజాబ్‌ అడ్వకేట్‌ జనరల్‌ ఇద్దరూ తమకు అభ్యంతరం లేదని చెప్పారు. విచారణ కమిటిలో సభ్యులుగా చండీగఢ్ డీజీపీ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఎన్ఐఏకు చెందిన ఐజీ, ఐబీ అధికారులు కూడా ఉంటారని, కమిటీలో పంజాబ్ నుంచి కూడా ప్రతినిధ్యం ఉంటుందని సీజేఐ ఎన్ వి రమణ తెలిపారు. పంజాబ్ ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీపై తమకు నమ్మకం లేదని, స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. సుప్రీంకోర్టులో విచారణకు ముందే పంజాబ్‌ అధికారులను దోషులుగా చిత్రీకరిస్తూ.. షోకాజ్‌ నోటీసులు ఇచ్చారని ధర్మాసనానికి ఏజీ తెలియజేశారు.

ఏజీ వాదనలపై సీజేఐ స్పందిస్తూ.. దోషులుగా చిత్రించి చర్యలు తీసుకుంటూ.. షోకాజ్‌ నోటీసులు ఇచ్చిన తర్వాత తాము విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముందని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రధాని భద్రతకు సంబంధించిన విషయంపై ఎస్‌పీజీ చట్టం ప్రకారం సంబంధిత అధికారులను ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉందంటూ సొలిసిటర్‌ జనరల్‌ సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా ప్రధాని పర్యటన ముందుగానే ఖరారైందని, వాతావరణ పరిస్థితుల దృష్ట్యానే రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారని, ఆ విషయం కూడా ముందుగానే రాష్ట్ర ఏజన్సీలకు సమాచారం ఇచ్చినట్లు ఎస్‌జీ తెలిపారు. ప్రధాని వాహనశ్రేణికి ముందు ఉన్న సెక్యూరిటీ వాహనం 100 మీటర్ల సమీపానికి వచ్చే వరకు పంజాబ్‌ అధికారులు రోడ్డు క్లియర్‌గా ఉందని తప్పుడు సమాచారం ఇచ్చారని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. ప్రధాని భద్రత వ్యవహారం కాబట్టే తమ ముందుకు వచ్చిన పిటిషన్‌ను విచారణకు తీసుకున్నామని, అయితే కేంద్రం ముందుగానే ఫలానా అధికారులు బాధ్యులు అంటూ చర్యలకు ఉపక్రమిస్తే ఇక తాము విచారణ చేపట్టేది ఏముంటుందని సీజేఐ ఎన్ వి రమణ ప్రశ్నించారు.

పంజాబ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ భయం నిజమైందని, ఇప్పటికే ఏడు షోకాజ్ నోటీసులు జారీ చేశారని ధర్మాసనానికి పంజాబ్‌ అడ్వకేట్‌ జనరల్‌ వివరించారు. విచారణ జరగకుండా, కనీసం తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం కూడా లేకుండానే తమ రాష్ట్ర అధికారులకు కేంద్రం షోకాజ్‌ నోటీసులు ఇచ్చిందని చెప్పారు. కేంద్రానికి చెందిన ఏ ఏజెన్సీ విచారణ చేపట్టినా వాస్తవాలు వెలుగులోకి రావని, స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఒకవేళ రాష్ట్ర అధికారులు దోషులుగా తేలితే తనను, తన ప్రభుత్వ అధికారులను ఉరితీయాలంటూ పంజాబ్ అడ్వకేట్ జనరల్ వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణ కమిటీలో పంజాబ్‌కు ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పడంతో ఏజీ అంగీకారం తెలిపారు. విచారణ కమిటీలోని సభ్యుల పేర్లు ఈ రోజు సాయంత్రం వెల్లడించే అవకాశం ఉంది.

Next Story
Share it