Telugu Gateway
Top Stories

సెబీ దర్యాప్తులో జోక్యానికి నిరాకరణ(Adani-Hindenburg case)

సెబీ దర్యాప్తులో జోక్యానికి నిరాకరణ(Adani-Hindenburg case)
X

సంచలనం సృష్టించిన అదానీ-హిండెన్ బర్గ్ కేసు లో సుప్రీం కోర్టు బుధవారం నాడు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటి) విచారణకు అప్పగించాల్సి అవసరం లేదు అని స్పష్టం చేసింది. సెబీ విచారణ కొనసాగిస్తుంది అని పేర్కొంది. స్వతంత్ర నియంత్రణా సంస్థ అయిన సెబీ పరిధిలోకి ప్రవేశించడానికి సుప్రీంకోర్టు అధికారం పరిమితమైనదని అభిప్రాయపడింది. సెబీ రెగ్యులేషన్స్ లో సవరణలు చేయాలని ఆదేశించడానికి, వాటిని నియంత్రించడానికి కానీ సరైన ఆధారాలు లేవని తెలిపింది. అదానీ కేసులో మొత్తం 24 ఆరోపణల్లో 22 ఆరోపణలపై ఇప్పటికే సెబీ విచారణ పూర్తి చేసిందని వెల్లడించింది. మిగిలిన రెండు అంశాల్లో కూడా మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని కోరింది. హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో షార్ట్ సెల్లింగ్ ఉల్లంఘనలను ప్రభుత్వం, సెబీ పరిశీలించాలని సుప్రీం ఆదేశించింది. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ సభ్యుల నిజాయితీపై లేవనెత్తిన ప్రశ్నలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ చర్యలనూ సమర్ధించింది. నిపుణుల కమిటీ పై వచ్చిన ఆరోపణలనూ తోసిపుచ్చింది. సెబీ రెగ్యులేషన్స్ పరిధిలోకి వెళ్లదలచుకోలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం, సెబీలు పెట్టుబడిదారులకు రక్షణ కల్పించాలని సీజేఐ ధర్మాసనం సూచించింది. స్టాక్ మార్కెట్ లో షేర్ విలువ పెంచుకునేందుకు అదానీ కంపెనీ అవకతవకలకు పాల్పడిందని 2023 జనవరిలో అమెరికా కు చెందిన హిడెన్ బర్గ్ షార్ట్ సెల్లింగ్ సంస్థ నివేదిక వెలువరించింది.

ఈ నివేదిక దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు కోరుతూ అత్యున్నత న్యాయస్థానాన్ని పలువురు ఆశ్రయించారు. దీనిపై సెబీ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుదీర్ఘ విచారణ జరిపి గత సంవత్సరం నవంబర్ 24న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేత్రుత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం నాడు అదానీ గ్రూప్ కు చెందిన అన్ని షేర్లు భారీ ఎత్తున లాభాలు ఆర్జించాయి. దీంతో ఒక్క రోజులోనే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రెండు లక్షల కోట్ల రూపాయల మేర పెరిగినట్లు సమాచారం. సుప్రీం తీర్పుపై గౌతమ్ అదానీ స్పందిస్తూ సత్యం గెలిచింది...సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. తమకు అండగా నిలబడ్డ వారందరికీ ధన్యవాదాలు అంటూ..భారత్ ప్రగతిపధంలో తాము కూడా తమ పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు.

Next Story
Share it