Telugu Gateway
Top Stories

ఏపీ సర్కారుకు షాక్..పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ఏపీ సర్కారుకు షాక్..పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
X

పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు ఆపాలంటూ ఏపీ సర్కారు, ఉద్యోగ సంఘాలు వేసిన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతే కాదు..ఈ సమయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యధావిధిగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ మొదటి నుంచి ప్రభుత్వ వాదనలతో విభేదించారు. ప్రభుత్వం తరపున వాదించిన ముకుల్ రోహత్గీ కూడా పిటీషన్ లో ఎస్ఈసీ దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలతో ఏకీభవించటం లేదని వ్యాఖ్యానించాల్సి వచ్చింది. రాజ్యాంగ సంస్థలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. గోవా సహా పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని,,కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం వాయిదా వేశారని ఏపీ ప్రభుత్వం తరపున వాదించిన ముకుల్ రోహత్గీ కోర్టుకు నివేదించారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు వ్యాక్సిన్ భద్రతలో ఉన్నారని వివరించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం 'ఎన్నికలు జరపటం ఎన్నికల సంఘం విధి. ఈ వ్యవహారంపై కోర్టు జోక్యం చేసుకోవటం సబబు కాదు. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగటం లేదా?. ఏదో ఒక వంకతో ఎన్నికలు ఆపాలని చూస్తున్నారు. ఇది రాజకీయ ప్రక్రియలో భాగం. మీ రాతలే మీ ఉద్దేశాన్ని తెలుపుతున్నాయి. మీరు ఎన్నికల కమిషనర్ పై రాసిన విధానం మీ ఆలోచనలను చూపుతున్నాయి. చట్ట వ్యతిరేకంగా ఎన్జీవో వ్యవహరిస్తున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారు. ప్రభావం తగ్గినప్పుడు వద్దంటున్నారు. దేశంలో రాజ్యాంగ బద్ధంగా ఉన్న వ్యక్తులు ఏమి చేయాలి. ఏం చేయకూడదు అన్నది కోర్టులు చెప్పాలా? ఎన్నికలు వాయిదా వేసుకుంటూ వెళ్ళడం సరికాదు అని అని సుప్రీం వ్యాఖ్యానించింది.

Next Story
Share it