ప్రపంచ ఆయిల్ కష్టాలు తీరినట్లేనా!

ప్రపంచానికి బిగ్ రిలీఫ్. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ లు చేసిన యుద్ధం కారణంగా గత 45 రోజులకు పైగా మూతపడిన హర్ముజ్ జలసంధి ఇప్పుడు పూర్తిగా తెరుచుకుంది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా వెల్లడించింది. ప్రపంచ చమురు రవాణాలో ఇది ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది అనే విషయం తెలిసిందే. హర్ముజ్ జలసంధి తెరుచుకోవడంతో ప్రపంచం ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నట్లు అయింది అనే చెప్పొచ్చు. ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా మారిన హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్టు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. ఇజ్రాయెల్-లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పంద కాలం ముగిసేవరకూ హర్ముజ్ పూర్తిగా తెరిచి ఉంటుందని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.ఇరాన్ తాజా ప్రకటనతో.. హర్ముజ్ జలసంధిలో అన్ని వాణిజ్య నౌకలకు మార్గం క్లియర్ అయింది. ఇరాన్, ఇతర దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపే ఈ జలమార్గంపై.. కొన్ని నెలలుగా వివాదాలు కొనసాగుతున్నప్పటికీ, కాల్పుల విరమణ సమయం ముగిసేవరకూ.. యథావిధిగా వాణిజ్య రవాణా కొనసాగించవచ్చని ఇరాన్ స్పష్టం చేసింది.
హర్ముజ్ జలసంధిని పూర్తిగా ఓపెన్ చేస్తున్నట్లు ఇరాన్ చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇది శుభ పరిణామం అన్నారు. అంతే కాదు హర్ముజ్ ఓపెన్ చేసినందుకు ఇరాన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇరాన్ ప్రకటనతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ వారాంతంలోనే అమెరికా, ఇరాన్ ల మధ్య రెండవ దశ చర్చలు జరిగి శాశ్వత శాంతికి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్న వేళ ఇరాన్ తీసుకున్న నిర్ణయం ఒక సంకేతం అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. తాము పెట్టిన అన్ని షరతులకు ఇరాన్ ఓకే చెప్పింది అని డోనాల్డ్ ట్రంప్ ఇటీవల వెల్లడించారు కూడా. అయితే వీటిపై ఇరాన్ ఇప్పటి వరకు ఎక్కడా అధికారికంగా స్పందించలేదు.



