Telugu Gateway
Top Stories

దేశాలు దాటిన దొంగ‌త‌నం

దేశాలు దాటిన దొంగ‌త‌నం
X

లండ‌న్ లో కొట్టేసిన బెంట్లీ కారు..క‌రాచీలో తేలింది. అందుకే ఇది దేశాలు దాటిన దొంగ‌త‌నం అయింది. కార్లు దొంగ‌త‌నాలు చాలా సార్లు జ‌రుగుతూనే ఉంటాయి. కొన్ని దొరుకుతాయి..మ‌రికొన్ని దొర‌క‌వు. ఎందుకంటే వాటిని ఎక్క‌డికి అక్క‌డ విడ‌గొట్టి అమ్మేస్తారు కాబ‌ట్టి. దొర‌క‌కుండా ఉండ‌టానికి దొంగ‌లు ఫాలో అయ్యే ఓ మోడ‌ల్ ఇది. విచిత్రం ఏమిటంటే లండ‌న్ లో కొట్టేసిన 2.3 కోట్ల రూపాయ‌ల విలువ చేసే బెంట్లీ ముల్సానే కారు ఏకంగా పాకిస్థాన్ లోని క‌రాచీలో దొరికింది. ఈ కారుకు సంబంధించిన ఓ వీడియోను కూడా నెటిజ‌న్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. క‌రాచీలోని క‌స్ట‌మ్స్ శాఖ త‌మ‌కు అందిన స‌మాచారం ఆధారంగా దాడి చేసి ఈ కారును స్వాధీనం చేసుకుంది. దొంగ డ్యాకుమెంట్లు త‌యారు చేసి ఈ కారును పాక్ కు దిగుమ‌తి చేసుకున్న‌ట్లు అధికారులు గుర్తించారు.

ఈ కారును గుర్తించ‌టం ఎలా సాధ్య‌మైంది అంటే కారును ఎత్తుకెళ్లిన దుండగులుగాని, వాడుతున్న వ్యక్తిగాని ట్రాకర్‌ను ఆఫ్‌ చేయడమో లేదా దానిని తొలగించడమో చేయలేదు. యూకే నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీ ట్రాకర్‌ సాయంతో ఆ బెంట్లీ కారు ప్రస్తుతం కరాచీలో ఉందని గుర్తించారు. వెంటనే పాకిస్థాన్‌ అధికారులకు సమాచారం అందించారు.దీంతో కలెక్టరేట్‌ ఆఫ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కరాచీలోని డీహెచ్‌ఏ అనే పోష్‌ ఏరియాలో ఉన్న ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెంట్లీ కారును గుర్తించారు. అయితే అది పాకిస్థాన్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో ఉంది. ఈనేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కారు ఛాసిస్‌ నంబర్‌ చూడగా.. అది యూకే క్రైమ్‌ ఏజెన్సీ ఇచ్చిన నంబర్‌తో సరిపోలింది. దీంతో దానిని సీజ్‌ చేశారు. కారును అమ్మిన మధ్యవర్తిని, కొనుగోలు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచార‌ణ చేస్తున్నారు.

Next Story
Share it