సెన్సెక్స్ 1260 పాయింట్లు పతనం
సోమవారం నాడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. గత కొంత కాలంగా పతనబాటలోనే నడుస్తున్న మార్కెట్లు వారం ప్రారంభంలోనే అదే ట్రెండ్ ను కొనసాగించాయి. సోమవారం పదిన్నర సమయంలో బీఎస్ ఈ సెన్సెక్స్ 1266 పాయింట్ల నష్టంతో 57,072.75 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశంలో ద్రవ్యోల్భణం పెరగటంతో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు..రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర దశకు చేరుకోవటంతో ఆ ప్రభావం మార్కెట్లపై పడింది. అదే సమయంలో దేశంలో కొత్తగా కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందనే అంచనాలు గత పదిహేను రోజుల వ్యవధిలో విదేశీ పోర్టో పోలియే ఇన్వెస్టర్లు (ఎఫ్ పిఐ)లు భారీ ఎత్తున అమ్మకాలకు దిగారు.
దీనికి సంబంధించిన గణాంకాలు కూడా వెల్లడయ్యాయి. ఎఫ్ పిఐల అమ్మకాలే గత కొంత కాలంగా మార్కెట్ ను కిందకు పడేస్తున్నాయి. దేశీయ పరిణామాలతోపాటు అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న అంశాలు కూడా మార్కెట్లో అనిశ్చితిని కొనసాగిస్తున్నాయి. ఈ వారంలో సుమారు 50కి పైగా కంపెనీలు తమ నాలగవ త్రైమాసిక ఫలితాలతో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. మార్కెట్ కు ఇవి ఎంతో కీలకం కానున్నాయి. మార్కెట్ ఇంత భారీ నష్టాల్లో ఉన్నా ఎన్టీపీసీ షేర్ మాత్రం లాభాలతో జీవిత కాల గరిష్ట స్థాయి 163 రూపాయలకు చేరింది.