కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు కూడా పతన బాటలోనే మొదలయ్యాయి. ప్రారంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్ల మేర నష్టపోయింది. సోమవారం కూడా మార్కెట్లు నష్టాలతోనే ముగిశాయి. రష్యా-ఉక్రెయిన్ల మధ్య పరిస్థితి కొత్త మలుపులు తీసుకోవటంతో మదుపర్లు ఆందోళనతో అమ్మకాలకు దిగుతున్నారు.ఈ వివాద పరిష్కారానికి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ల మధ్య చర్చలు ఉంటాయని తొలుత వార్తలు వచ్చాయి. కానీ అవేమీ అమలుకు నోచుకునే అవకాశం కన్పించకపోవటంతో మార్కెట్లు పతనబాటలో సాగుతున్నాయి. చాలా కాలంగా పలు రంగాలకు చెందిన షేర్లు పెరుగుతూ పోయాయి. కొన్ని షేర్లు అయితే ఓవర్ వ్యాల్యూయేషన్ అన్న అభిప్రాయం కూడా ఉంది. ఇందులో మొదటి వరసలో ఫిన్ టెక్ కంపెనీల షేర్లు ఉన్నాయి.
ముఖ్యంగా ఐపీవో ద్వారా షేర్లు పొందిన పేటీఎం ఇన్వెస్టర్లకు మాత్రం షాక్ మామూలుగాలేదు. ఐపీవోలో పేటీఎం షేర్లను 2150 రూపాయలకు ఆఫర్ చేయగా..లిస్టింగ్ దగ్గర నుంచి ఇప్పటివరకూ ఆ ధర రాకపోగా..ఇప్పుడు అది 795 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. మంగళవారం నాడే 52 వారాల కనిష్ట స్థాయి 782 రూపాయలను తాకింది. ఉక్రెయిన్ లో వేర్పాటువాద ప్రాంతాలను రష్యా అధికారికంగా గుర్తించటం, వాటితో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమవుతుండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. పుతిన్ శాంతిమార్గం కంటే యుద్ధంవైపే అడుగులు వేస్తున్నట్లు కన్పిస్తుండటంతో అంతర్జాతీయంగా ఈ ప్రభావం మార్కెట్లపై పడింది. మంగళవారం ఉదయం 9.40 గంటల ప్రాంతంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1019 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది.