Telugu Gateway
Top Stories

లిస్టింగ్ షేర్లకు సూపర్ లాభాలు

లిస్టింగ్ షేర్లకు సూపర్ లాభాలు
X

స్టాక్ మార్కెట్ లో సోమవారం నాడు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు లిస్ట్ అయి దుమ్ము రేపిన విషయం తెలిసిందే. తొలి రోజే ఇన్వెస్టర్లకు ఈ షేర్లు మంచి లాభాలను ఇచ్చాయి. అక్కడితో ఆగలేదు. మంగళవారం నాడు ఈ షేర్లు అప్పర్ సర్క్యూట్ బ్రేకర్ ను తాకాయి. సోమవారం నాడు 165 రూపాయల వద్ద ముగిసిన షేర్లు...మంగళవారం నాడు మరో 16 రూపాయలకు పైగా లాభంతో 181 .48 రూపాయల వద్ద ముగిశాయి. ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు డిమాండ్ రావంతో మధ్యలో కాస్త తగ్గినా కూడా ఫైనల్ గా అప్పర్ సర్క్యూట్ వద్దే ముగిశాయి. బజాజ్ హౌసింగ్ ఆఫర్ ధర 70 రూపాయలతో పోలిస్తే రెండు రోజుల్లేనే ఈ షేర్ పై ఇన్వెస్టర్లకు 111 రూపాయల లాభం వచ్చినట్లు అయింది.

ఈ షేర్ల హవా ఇలా ఉంటే...మంగళవారం నాడు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన పీ ఎన్ గాడ్గిల్ షేర్లు కూడా దుమ్ము రేపాయి. ఈ కంపెనీ ఐపీఓ ఆఫర్ ధర 480 రూపాయలు అయితే తొలి రోజు బిఎస్ఈ లో ఇవి 844 రూపాయల వద్ద లిస్ట్ అయ్యాయి. ఆఫర్ ధరతో పోలిస్తే పీ ఎన్ గాడ్గిల్ షేర్లు కూడా ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చిపెట్టటాయి అనే చెప్పాలి. చివరకు ఆఫర్ ధరతో పోలిస్తే 313 రూపాయల లాభంతో 793 రూపాయల వద్ద ముగిశాయి. దేశంలోని అతిపురాతనమైన నగల కంపెనీల్లో పీ ఎన్ గాడ్గిల్ ఒకటి.

మహారాష్ట్ర కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మంగళవారం నాడు బిఎస్ఈ 90 పాయింట్ల లాభంతో ముగిసింది. గత కొన్ని రోజులుగా వరసగా నష్టాలు చవిచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ షేర్లు పది రూపాయలకు పైగా లాభంతో 118 రూపాయల వద్ద ముగిసింది. పలు బ్రోకింగ్ సంస్థల రెకమండేషన్ తో ఈ షేర్ లాభాల బాట పట్టింది. దీంతో పాటు సెన్సెక్స్ లోని భారతీ ఎయిర్ టెల్, ఎన్టీపీసి, మహింద్ర అండ్ మహీంద్రా, టైటాన్, ఎల్ అండ్ టి షేర్లు లాభాలు గడించాయి. టాటా మోటార్స్ , అదానీ పోర్ట్స్ , ఐటీసి , టాటా స్టీల్ తదితర షేర్లు నష్టాలతో ముగిశాయి.

Next Story
Share it