Telugu Gateway
Top Stories

స్టాక్ మార్కెట్లో ఉక్రెయిన్ ప్ర‌కంప‌న‌లు

స్టాక్ మార్కెట్లో ఉక్రెయిన్ ప్ర‌కంప‌న‌లు
X

అక్క‌డ యుద్ధం ఆగ‌టం లేదు. ఇక్క‌డ స్టాక్ మార్కెట్ల ప‌త‌నం ఆగ‌టంలేదు. దేశీయ స్టాక్ మార్కెట్లో సోమ‌వారం ఉద‌యం నుంచి క‌ల్లోలం నెల‌కొంది. ప‌ది గంట‌ల స‌మ‌యంలో సెన్సెక్స్ ఏకంగా 1500 పాయింట్ల న‌ష్టంతో ట్రేడ్ అవుతోంది. ఎన్ ఎస్ ఈ నిఫ్టీదీ కూడా అదే దారి. ఈ షేరు..ఈ షేరు అని లేకుండా అన్నీ ప‌త‌న‌బాట‌లోనే సాగుతున్నాయి. ర‌ష్యా-ఉక్రెయిన్ ల మ‌ధ్య సాగుతున్న యుద్ధం ఏ మ‌లుపు తిరుగుతుందో అన్న టెన్ష‌న్ ప్ర‌పంచ వ్యాప్తంగా నెల‌కొంది. అసలు దీనికి ముగింపు ఎప్పుడు అన్న‌ది కూడా ఎవ‌రికీ స్ప‌ష్టత రావ‌టంలేదు. అదే త‌రుణంలో అంత‌ర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు కూడా రోజురోజుకు కొత్త గ‌రిష్ట స్థాయిల‌కు చేరుతున్నాయి. ఇది దేశీయ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.

దీంతో మ‌దుప‌ర్లు చాలా వ‌ర‌కూ అమ్మ‌కాల వైపే మొగ్గుచూపుతున్నాయి. చ‌మురు బ్యారెల్ ధ‌ర ఇప్ప‌టికే 130 డాల‌ర్ల‌కు చేరింది. క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఏర్ప‌డిన చిప్ ల కొర‌త ఇప్పుడు ఈ యుద్ధంతో మ‌రింత తీవ్ర‌రూపం దాల్చే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. దీని వ‌ల్ల ఆటోమొబైల్ రంగంతో పాటు ఇత‌ర ఎల‌క్ట్రానిక్స్ రంగంపై కూడా ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంది. స్టాక్ మార్కెట్లో బూమ్ చూసి క‌రోనా స‌మ‌యంలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట‌ర్లు ఇక్క‌డ పెట్టబ‌డులు పెట్టారు. ఇప్పుడు వారు ప‌రిస్థితిని చూసి ల‌బోదిబోమ‌నాల్సి వ‌స్తోంది.

Next Story
Share it