స్టాక్ మార్కెట్లో ఒక్క రోజు నష్టం పది లక్షల కోట్లు!
రష్యా-ఉక్రెయిన్ ల మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లను ముంచాయి. ఒక్క భారత్ లోనే ఇన్వెస్టర్ల సంపద పది లక్షల కోట్ల రూపాయలు మాయం అయ్యాయి. గురువారం ఉదయం నుంచి మార్కెట్లు కుప్పకూలుతూనే ఉన్నాయి. ప్రారంభంలోనే ఏకంగా 2000 పాయింట్ల మేర సెన్సెక్స్ నష్టపోయింది. మధ్యలో కొంత కోలుకున్నా ముగింపు లోనూ ఏకంగా 2700 పాయింట్ల నష్టంతో ముగిసింది. దీంతో ఆ షేరు..ఈ షేరు అని లేకుండా అన్నీ పతనబాటలోనే సాగాయి. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై దాడుల విషయంలో దూకుడు ప్రదర్శిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధర గణనీయంగా పెరిగింది.
రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది. యుద్థ వాతావరణంతోపాటు పెరగనున్న ప్రెటోలియం ఉత్పత్తుల ధరలు మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ మధ్య కాలంలో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా ఐదు శాతం మేర నష్టపోవటం ఇదే మొదటిసారి. యుద్ధవాతావరణంతో బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మాత్రమే కాదు..నిఫ్టీ లో కూడా అన్ని షేర్లు నష్టాలతో ముగిశాయి. ఈ రంగానికి చెందిన షేర్లు కూడా ఈ పతనం నుంచి తప్పించుకోలేకపోయాయి. ఉక్రెయిన్ పై దాడి కారణంగా రష్యా కరెన్సీ రూబెల్ కూడా రికార్డు స్థాయిలో పతనం అయ్యాయి