Telugu Gateway
Top Stories

ఒక్క రోజులో 14 లక్షల కోట్లు హాంఫట్

ఒక్క రోజులో 14 లక్షల కోట్లు హాంఫట్
X

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కు ఇంకా కేవలం రోజులే మిగిలి ఉంది. ఈ తరుణంలో బుధవారం నాడు స్టాక్ మార్కెట్ లో భారీ పతనం చోటు చేసుకుంది. ఇది చూసిన వాళ్ళు అంతా మార్కెట్ లో ఎన్నికల కరక్షన్ మొదలు అయింది అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఈ రెండు నెలల కాలంలో మార్కెట్ లో తీవ్ర ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బుధవారం నాటి స్టాక్ మార్కెట్ పతనంతో ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద 14 లక్షల కోట్ల రూపాయల మేర తుడిచిపెట్టుకు పోయింది. గత రెండేళ్ళ కాలంలో ఇంత భారీ ఎత్తున అమ్మకాలు సాగలేదు అని గణాంకాలు చెపుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ తో పాటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా భారీ ఎత్తున పతనం అయింది. సెన్సెక్స్ పతనంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక పాత్ర పోషించింది. ఈ కంపెనీ షేర్లు బుధవారం నాడు 85 రూపాయలు నష్టపోయి 2864 రూపాయల వద్ద ముగిశాయి.

వచ్చే ఎన్నికల్లో మరో సారి కేంద్రంలో మోడీ సర్కారు కొలువు తీరుతుంది అనే అంచనాలు ఉన్నా కూడా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవరిస్తున్నారు. దీంతో పాటు స్టాక్ మార్కెట్ లో చిన్న , మధ్య తరహా షేర్లు అడ్డగోలుగా పెరిగాయి అని...ఈ బుడగ ఎప్పుడైనా పేలిపోవచ్చు అంటూ సెబీ చైర్ పర్సన్ మాదబీ పూరి బుచ్ చేసిన వ్యాఖ్యలు కూడా మార్కెట్ పతనానికి కారణం అయ్యాయి అని నిపుణులు చెపుతున్నారు. ఎన్నికలు పూర్తి అయి ఫలితాలపై స్పష్టత వచ్చిన తర్వాతే మార్కెట్ దశ, దిశా ఖరారు కావచ్చు అని...అప్పటి వరకు మార్కెట్ లో ఒడిదుడుకులు తప్పవు అనే అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు గత కొంత కాలంగా స్టాక్ మార్కెట్ లు పెరుగుతూ వచ్చినందున చాలా మంది ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం కూడా మార్కెట్ల పతనానికి కారణం అయింది అనే చర్చ ఉంది.

Next Story
Share it