శ్రీశైలంలో సందడి షురూ
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి మొదలైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భారీ ఎత్తున నీరు వచ్చి చేరటంతో బుధవారం సాయంత్రం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నిండేందుకు అవసరమైన ఫ్లో వస్తుండటంతో గేట్లు ఎత్తేశారు. జూరాల, సుంకేశుల నుంచి నాలుగున్నర లక్షల క్యూసెక్కులకుపైగా నీరు శ్రీశైలంలోకి వచ్చి చేరుతోంది. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ప్రాజెక్టు అధికారులు సంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహించి గేట్లు ఎత్తారు.
క్రమంగా గేట్ల సంఖ్యను పెంచి నాగార్జునసాగర్ కు నీటి విడుదలను మరింత పెంచే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2007 సంవత్సరం తర్వాత జులై లో ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయటం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట సామర్ధ్యం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.5 అడుగుల మేర నీరు ఉంది. ప్రాజెక్టులోకి నీరు పెద్ద ఎత్తున వస్తుండటంతో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభించారు.