సింగపూర్ ను దాటేసిన దోహ అంతర్జాతీయ విమానాశ్రయం
లెక్క మారింది. కొత్త విమానాశ్రయాలు తెరపైకి వచ్చాయి. ఒకప్పుడు ప్రధమ స్థానంలో ఉన్నవి వెనక్కి పోయాయి. వెనక ఉన్నవి ముందుకొచ్చాయి. ప్రపంచంలోని పది అగ్రశ్రేణి విమానాశ్రయాల జాబితాను విడుదల చేసింది స్కైట్రాక్స్. ఈ సంస్థ తాజాగా వార్షిక ప్రపంచ విమానాశ్రయ అవార్డుల పేర్లను ప్రకటించింది. అయితే ఈ సారి ఖతార్ కు చెందిన దోహలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయ అవార్డును దక్కించుకుంది. వరసగా అంటే ఏకంగా గత ఏనిమిదేళ్ళుగా సింగపూర్ కు చెందిన చాంగీ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ అవార్డును కైవసం చేసుకుంటోంది. అయితే ఈ సారి మాత్రం దోహలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధమ స్థానంలో నిలిచింది. హమద్ తర్వాత రెండవ స్థానంలో టోక్యోకు చెందిన హనెడా విమానాశ్రయం రెండవ స్థానంలో నిలిచింది. గత ఏడాది హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం మూడవ స్థానంలో ఉంది.
కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విమానయాన రంగం తీవ్ర ఇబ్బందుల్లో పడ్డా కూడా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ పనులు కొనసాగించటంతోపాటు విమానాశ్రయంలో అదనపు ఆరోగ్య జాగ్రత్త చర్యలు, సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. దోహ ట్రావెల్ హబ్ గా ఉండటంతోపాటు 2022లో ఫిఫా ప్రపంచ కప్ కు కూడా ఆతిధ్యం ఇవ్వనుందని తెలిపారు. ఈ విమానాశ్రయంలో ప్రయాణికుల వార్షిక సామర్ధ్యాన్ని 53 మిలియన్లకు పెంచారు. అంతే కాకుండా 110,000 చదరపు అడుగుల్లో ఉష్ణమండల తోటను డెవలప్ చేశారు. విమానాశ్రయంలోనే 900 అడుగుల ఎత్తైన వాటర్ ఫాల్ కూడా నిర్మించారు. ఇదిలా ఉంటే సింగపూర్ కు చెందిన చాంగీ విమానాశ్రయం ఆసియాలోనే అత్యుత్తమ విమానాశ్రయ సిబ్బంది అవార్డును దక్కించకుంది. స్కైట్రాక్స్ ప్రకారం ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాల జాబితా ఇలా ఉంది..
ప్రపంచంలోని పది అత్యుత్తమ విమానాశ్రయాలు
హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం, దోహ
టోక్యో హనెడా విమనాశ్రయం
సింగపూర్ చాంగీ విమానాశ్రయం
ఇన్ చోన్ అంతర్జాతీయ విమానాశ్రయం, దక్షిణ కొరియా
నరిటా అంతర్జాతీయ విమానాశ్రయం, టోక్యో
మ్యూనిక్ విమానాశ్రయం, జర్మనీ
జ్యూరిక్ విమానాశ్రయం, స్విట్జర్లాండ్
లండన్ హీత్రూ విమానాశ్రయం
కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, జపాన్
హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం