Telugu Gateway
Top Stories

ఆ విమానం అస‌లు కింద‌కు దిగ‌దు

ఆ విమానం అస‌లు కింద‌కు దిగ‌దు
X

విమానం అంటే టేకాఫ్..ల్యాండింగ్ స‌హ‌జం. కానీ ఈ విమానం అస‌లు ల్యాండ్ కాదు. అలా గాల్లోనే తిరుగుతూనే ఉంటుంది. అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా?. అదే దీని స్పెష‌ల్. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న విమానాల్లో ఏ380 డ‌బుల్ డెక్క‌ర్ విమానాలు ఒక్క‌టే అత్య‌ధిక సంఖ్య‌లో ప్ర‌యాణికుల‌ను తీసుకెళ్ళ‌గ‌ల‌వు. ఏ 380 విమాన సామ‌ర్ధ్యం గ‌రిష్టంగా 853 లేదా తొమ్మిది వంద‌ల మంది అనుకోండి. కానీ ఈ విమాన నౌక ఏకంగా 5000 మంది ప్ర‌యాణికుల‌ను తీసుకెళ్ళ‌గ‌ల‌దు. అయితే ఇది ఎప్ప‌టికి అందుబాటులోకి వ‌స్తుందో తెలియ‌దు కానీ..డిజైన్ అయితే అంతా సిద్ధం అయింది. ఆర్టిఫిష‌య‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఇది న‌డ‌వ‌నుంది. అంతే కాదు...ఇందులో చాలా ప్ర‌త్యేకత‌లు ఉన్నాయి. మ‌న‌కు తెలిసి ఏ విమానం అయినా కూడా ఏవియేష‌న్ ట‌ర్భైన్ ఫ్యూయ‌ల్ (ఏటీఎఫ్‌)తోనే న‌డుస్తుంది. కానీ కొత్త‌గా డిజైన్ చేసిన 'స్కై క్రూయిజ్‌' అణువిద్యుత్ తో న‌డ‌వ‌నుంది. అత్యంత సుర‌క్షితంగా ఈస్కై క్రూయిజ్ లోనే దీనికి అవ‌స‌ర‌మైన ఇంథ‌నాన్ని ఉత్ప‌త్తి చేస్తారు. ఎప్పుడైనా..ఏమైనా స‌మ‌స్య‌లు వ‌చ్చినా కూడా గాల్లోనే రిపేర్లు చేస్తారు. యెమ‌న్‌కు చెందిన ప్రముఖ సైన్స్‌ ఇంజనీర్‌ హషీమ్‌ అల్‌–ఘాయిలీ యూట్యూబ్‌లో స్కై క్రూయిజ్‌ పేరిట తాజాగా విడుదల చేసిన 'ఎగిరే హోటల్‌' కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది చూసి వారంతా వావ్ అంటూ అవాక్కు అవుతున్నారు. ఏకంగా ఈ స్కై క్రూయిజ్ 20 ఇంజ‌న్ల‌తో త‌న ప్ర‌యాణాన్ని సాగిస్తుంది. అయితే ఇందులోకి ప్ర‌యాణికులు చేరేది ఎలా అన్న సందేహం రావటం స‌హ‌జం. నూతన డిజైన్‌ ప్రకారం ప్రయాణికులను, నిత్యావసరాలను సాధారణ వాణిజ్య విమానాలు లేదా ప్రైవేటు జెట్‌ల ద్వారా స్కై క్రూయిజ్‌ చెంతకు చేర్చి ప్రత్యేకమైన 'లిఫ్ట్‌' ద్వారా ఈ ఎగిరే హోటల్‌లోకి చేరుస్తార‌ని చెబుతున్నారు. యుద్ధ విమానాల‌కు ఇంథ‌నాన్ని గాల్లోనే నింపే వెసులుబాటు ఉన్న విష‌యం తెలిసిందే.

ఈ స్కై క్రూయిజ్ విలాసాల‌కు కేంద్రంగా విరాజిల్ల‌నుంది. ఇందులో భారీ షాపింగ్‌ మాల్, రెస్టారెంట్లు, బార్లు, స్పోర్ట్స్‌ సెంటర్లు, ప్లేగ్రౌండ్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూళ్లు, వెడ్డింగ్‌ హాళ్లు, సమావేశ మందిరాలు ఉండేలా డిజైన్‌ చేశారు. ప్రత్యేకించి విమానం తోక భాగంలో ఉండే భారీ డెక్‌ నుంచి 360 డిగ్రీల కోణంలో పైనున్న అంతరిక్షాన్ని, దిగువనున్న యావత్‌ ప్రపంచాన్ని అతిథులు వీక్షించే ఏర్పాట్లు చేయనున్నారు. విమానం మధ్య భాగం నుంచి లోపలకు వెలుతురు ప్రసరించేలా పూర్తిగా గ్లాస్‌ బాడీతో దీన్ని డిజైన్‌ చేయనున్నారు. విమానానికి ఇరువైపులా ఏర్పాటు చేసే బాల్కనీల తరహా డోమ్‌ల నుంచి అతిథులు చుక్కలను చూసే ఏర్పాటు సైతం ఉంది. అలాగే దట్టమైన మేఘాల్లోంచి ప్రయాణించే సమయంలో విమానం కుదుపులు లేదా కంపనాలకు గురయ్యే అవకాశం ఉంటే దాన్ని కొన్ని నిమిషాల ముందే గుర్తించి వాటిని నివారించేలా యాంటీ వైబ్రేషన్‌ టెక్నాలజీ సైతం ఈ క్రూయిజ్‌ క్రాఫ్ట్‌లో ఏర్పాటు ,చేస్తారు. ఈ ప్ర‌యాణ స‌మ‌స్యంలో ఎవ‌రికైనా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తే చికిత్స అందించేలా ఇందులో ఒక అత్యాధునిక వైద్య కేంద్రాన్ని కూడా డిజైన్‌ చేశారు. నిత్యం డాక్ట‌ర్లు కూడా అక్క‌డ అందుబాటులో ఉంటారు.

Next Story
Share it