Telugu Gateway
Top Stories

తెలుగు రాష్ట్రాల‌కు ఆరు ప‌ద్మ అవార్డులు

తెలుగు రాష్ట్రాల‌కు ఆరు ప‌ద్మ అవార్డులు
X

గులాంన‌బీ ఆజాద్ కు ప‌ద్మ‌భూష‌ణ్‌

దేశానికి విశేష సేవ‌లు అందించిన వారికి ప్ర‌క‌టించే పద్మ అవార్డుల జాబితా వ‌చ్చింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాల జాబితాను వెల్ల‌డించింది. ప‌లు రంగాల్లో విశేష సేవ‌లు అందించిన వారిని ఈ అవార్డుల‌కు ఎంపిక చేశారు. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌కు పద్మ విభూషణ్‌ ప్రకటించింది. ఇటీవ‌ల ఆయ‌న ఘోర హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. మొత్తం జాబితాలో కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించ‌టం ఆస‌క్తిక‌ర పరిణామంగా ఉంది. గ‌త కొంత కాలంగా ఆయ‌న కాంగ్రెస్ అధిష్టానంపై విమ‌ర్శ‌లు చేస్తూ..ప్ర‌ధాని మోడీ పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ వ‌స్తున్నారు.

ఈ త‌రుణంలో ఆయ‌న‌కు ఈ అవార్డు ద‌క్క‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. 128 మందిలో నలుగురికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మ భూషణ్‌, 107 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించారు. . తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి పద్మశ్రీలు దక్కాయి. ఏపీ నుంచి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు, సుంకర వెంకట ఆదినారాయణ, షేక్‌హసన్‌ పద్మశ్రీ అవార్డులు దక్కాయి. తెలంగాణ నుంచి పద్మజారెడ్డి, దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్యలను పద్మశ్రీలు వరించాయి. అలాగే కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాకు సంయుక్తంగా పద్మభూషణ్ అవార్డు ద‌క్కింది. టెక్‌ దిగ్గజాలు సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌లకు పద్మభూషణ్‌ పురస్కారాలు దక్కాయి. భార‌త్ లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ త‌యారు చేసిన సీర‌మ్ ఇన్ స్టిట్యూట్ అధినేత సైర‌స్ పూనావాలాకు కూడా ఈ అవార్డు ద‌క్కింది.

Next Story
Share it