Telugu Gateway
Top Stories

ఆరు కోట్ల బిర్యానీలు ఆర్డ‌ర్ చేశారు

ఆరు కోట్ల బిర్యానీలు ఆర్డ‌ర్ చేశారు
X

బిర్యానీ. ఆ పేరు వింటేనే చాలా మందికి కిక్కు వ‌స్తుంది. ముఖ్యంగా యూత్ లో బిర్యానీకి క్రేజ్ ఎక్కువ ఉంటుంది. ఏ ఇద్ద‌రు ఫ్రెండ్స్ క‌ల‌సినా ఛ‌లో బిర్యానీ లాగించేద్దాం అంటూ ముందుకు సాగుతారు. అందులో మ‌న హైద‌రాబాద్ బిర్యానీ దేశ వ్యాప్తంగా ఫేమ‌స్ అన్న విష‌యం తెలిసిందే. పార్టీ చిన్న‌ది అయినా..పెద్ద‌ది అయినా అందులో బిర్యానీ అనేది లేక‌పోతే అస‌లు అది పార్టీయే కాదు. అంత కామ‌న్ డిష్ గా మారిపోయింది బిర్యానీ. ప్ర‌ముఖ ఫుడ్ డెలివరి యాప్ స్విగ్గీ తాజాగా బిర్యానీకి సంబంధించి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన డేటాను విడుద‌ల చేసింది. ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాల‌ను షేర్ చేసింది. అది ఏంటి అంటే 2021 సంవ‌త్స‌రంలో ఒక్క స్విగ్గీయాప్ ద్వారా ఆరు కోట్ల నాలుగు ల‌క్షల 44 వేల బిర్యానీలు ఆర్డ‌ర్ చేశారు. దేశంలోని ఐదు వంద‌ల న‌గ‌రాల్లోని డేటా ప్ర‌కారం ఈ వివ‌రాలు వెల్ల‌డించారు. ఒక్క స్విగ్గీ ద్వారానే ఆరు కోట్ల బిర్యానీలు ఆర్డ‌ర్ చేశారంటే మిగిలియ‌న్ యాప్ లు..నేరుగా హోట‌ల్స్ వెళ్లే వారి లెక్క తేలితే బిర్యానీ ఎంత ఫేమ‌స్ డిష్ గా మారిందో అర్ధం అవుతుంది.

అయితే బిర్యానీ ఇలా మొత్తం ఫుడ్ ఆర్డ‌ర్ల‌లో అగ్ర‌స్థానం పొంద‌టం ఇది వ‌ర‌స‌గా ఐద‌వ ఏడాది కావటం విశేషం. 2020లో నిమిషానికి 90 బిర్యానీ ఆర్డ‌ర్లు రాగా..2021లో అది నిమిషానికి 115కి పెరిగింది. ఈ బిర్యానీల్లో కూడా చికెన్ బిర్యానీదే అగ్ర‌స్థానం. బెంగుళూరు, చెన్న‌య్, కోల్ క‌తా, ల‌క్నో, హైద‌రాబాద్ న‌గ‌రాల్లో చికెన్ బిర్యానీల హ‌వా ఎక్కువ ఉన్న‌ట్లు స్విగ్గీ డేటా తెలిపింది. చికెన్ త‌ర్వాత స్థానం స‌హ‌జంగానే మ‌ట‌న్ ఆక్ర‌మించింది. స్విగ్గీ ట్విట్ట‌ర్ లో బిర్యానీ ఆర్డ‌ర్ల డేటాను షేర్ చేయ‌గానే...వెజిటేరియ‌న్ బిర్యానీల ఆర్డ‌ర్ల వివ‌రాలు కూడా చెప్పాలంటూ నెటిజన్లు రిక్వెస్ట్ లు పెట్టారు. ముంబ‌య్ లో మాత్రం చికెన్ బిర్యానీల‌తో స‌మానంగా దాల్ కిచిడీలు కూడా ఆర్డ‌ర్ చేశార‌ని గ‌ణాంకాలు తెలిపాయి.

Next Story
Share it