కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్ లు తప్పనిసరి

విదేశాలకు ఎగుమతి చేసే కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులు పెడుతూ..భారత్ లోని కార్లకు మాత్రం అవే సంస్థలు కేవలం నాలుగు ఎయిర్ బ్యాగ్ లు పెట్టడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మన జీవితాలకు విలువలేదని మీరు భావిస్తున్నారా అంటూ ఆయన కార్ల తయారీదారులను ప్రశ్నించారు. ఒక్కో ఎయిర్ బ్యాగ్ ను అదనంగా పెట్టడం వల్ల అయ్యే వ్యయం కేవలం 900 రూపాయలు మాత్రమేనన్నారు. భారత్ లోనూ తప్పనిసరిగా ఆరు ఎయిర్ బ్యాగ్ లు ఉండేలా ఖచ్చితమైన నిబంధన అమల్లోకి తీసుకొస్తామని..రోడ్డు భద్రత అంశంలో అంతర్జాతీయ ప్రమాణాల విషయంలో రాజీపడేదిలేదన్నారు.
టాటా సన్స్ మాజీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ ఘోర రోడ్డుర ప్రమాదంలో మరణించటంతో మరోసారి ఎయిర్ బ్యాగ్ ల అంశం చర్చకు వచ్చింది. తాను పలు సందర్భాల్లో నలుగురు సీఎంలతో కలసి కార్లలో ప్రయాణించానని..అయితే ఆ సమయంలో తాను ముందు సీట్లో కూర్చుని చూడగా..సీటు బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అందులో క్లిప్ పెట్టారని నితిన్ గడ్కరీ వెల్లడించారు. అయితే ఆ నలుగురు సీఎంల పేర్లు అడగవద్దని..క్లిప్ పెట్టడంతో సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా ఎలాంటి సౌండ్ రాలేదన్నారు. తర్వాత తాను ఈ క్లిప్ ల తయారీని నిషేధించానని గడ్కరీ వెల్లడించారు.