ఒక్క రోజులోనే 4529 కరోనా మరణాలు
దేశంలో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కేసులు మాత్రం మూడు లక్షల లోపే నమోదు అవుతుండటం సానుకూల పరిణామం అయినా..మరణాలు మాత్రం రోజుకో కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 4529 మరణాలు నమోదు అయ్యాయి. ఇప్పటివరకూ ఒక్క రోజులో ఇంత భారీ స్థాయిలో నమోదు కావటం ఇదే మొదటిసారి. అయితే సోమవారంతో పోలిస్తే మంగళవారం నాడు కేసుల్లో కూడా స్వల్ప పెరుగుదల ఉంది. మంగళవారం నాడు 20,08,296 మందికి పరీక్షలు నిర్వహించగా..2,67,334 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
దేశంలో ఇప్పటివరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 2.54 కోట్ల మంది ఉండగా, 2,83,248 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండవ దశ కరోనాలో అత్యధిక కేసులు నమోదు అయిన మహారాష్ట్రలోనే మరణాలు అధిక సంఖ్యలో ఉంటున్నాయి. అక్కడ కేసులు తగ్గుముఖం పడుతున్నా మరణాలు మాత్రం ఆగటం లేదు. ఒక్క మంగళవారం నాడే కరోనా నుంచి 3,89,851 మంది కోలుకున్నారు. దీంతో రికవరి అయిన వారి సంఖ్య మొత్తం 2.19 కోట్ల కు పెరిగింది.