క్వారంటైన్ నిబంధన ఎత్తేసిన సింగపూర్..పర్యాటకులకు లైన్ క్లియర్
ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులకు ఇప్పుడు దారులు తెరుచుకుంటున్నాయి. పలు దేశాల్లో కోవిడ్ పూర్తిగా సద్దుమణగటంతో గేట్లు బార్లా తెరుస్తున్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణగా దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్థలను గాడినపెట్టేందుకు పలు దేశాలు ఈ వేసవి సీజన్ ను ఉపయోగించుకునే పనిలోపడ్డాయి. అందులో భాగంగానే ఒక్కో దేశం..పలు ఎయిర్ లైన్స్ పర్యాటకులను ఆకట్టుకునేందుకు పలు ఆఫర్లు ప్రకటించేందుకు రెడీ అవుతున్నాయి. అందులో భాగంగానే సింగపూర్ ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసింది. ఇది సింగపూర్ వెళ్ళాలనుకునే పర్యాటకులకు శుభవార్తే. ఏప్రిల్ 1 నుంచి అక్కడ క్వారంటైన్ నిబంధనను పూర్తిగా ఎత్తేస్తున్నారు. దీంతో ఎప్పటిలాగానే వీసా ఉంటే చాలు సింగపూర్ పర్యటనకు వెళ్లొచ్చు. భారత్ కూడా శనివారం అర్ధరాత్రి నుంచే అంతర్జాతీయ వాణి్జ్య విమాన సర్వీసులు ప్రారంభించనున్న విషయం తెలిసిందే. పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ వేసుకున్న వారు ఎలాంటి క్వారంటైన్ లేకుండా దేశంలో పర్యటించవచ్చని సీంగపూర్ కొత్తగా ప్రకటించిన తన నిబంధనల్లో పేర్కొంది.
అయితే పర్యటనకు ముందు మాత్రం కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడ దిగిన తర్వాత ఎలాంటి ఇతర ఇబ్బందులు ఉండవు. తాజా నిబందనలతో పర్యాటక రంగం తిరిగి గాడిన పడే అవకాశం కన్పిస్తోంది. సింగపూర్ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ట్రావెల్ ప్రొటోకాల్స్ లో మార్పులు చేయటంతో సింగపూర్ ఎయిర్ లైన్స్ తోపాటు స్కూట్ ఎయిర్ లైన్స్ కూడా ఎలాంటి క్వారంటైన్ నిబంధనలు లేకుండా ప్రయాణికులు తమ రాకపోకలు సాగించవచ్చని పేర్కొన్నాయి. సింగపూర్ ఎయిర్ లైన్స్, స్కూట్ ఎయిర్ లైన్స్ ప్రస్తుతం 34 దేశాలకు చెందిన 97 ప్రాంతాల నుంచి సర్వీసులను నడుపుతున్నాయి. కొత్త నిబంధనలతో ప్రయాణికులు వ్యాక్సినేటెడ్ ట్రావెల్ లైన్ (వీటీఎల్) మార్గంలో రావాల్సిన అవసరం లేదని తెలిపారు. నిబంధనల ప్రకారం ఉన్న సింగపూర్ ఎయిర్ లైన్స్, స్కాట్ ఎయిర్ లైన్స్ కు చెందిన ట్రాన్సిట్ ప్రయాణికులను కూడా అనుమతించనున్నారు.