Telugu Gateway
Top Stories

ఒక్క రోజులోనే పది లక్షల కోట్లు ఆవిరి

ఒక్క రోజులోనే పది లక్షల కోట్లు ఆవిరి
X

దేశీయ ప్రైమరీ మార్కెట్ జోష్ లో ఉంటే...గత కొంత కాలంగా సెకండరీ మార్కెట్ లో మాత్రం తీవ్ర ఒడిదుడుకులు నమోదు అవుతున్నాయి. సెకండరీ మార్కెట్ ఎప్పటికి గాడిన పడుతుంది అన్నది ఇప్పుడు ఇన్వెస్టర్లను వేధిస్తున్న ప్రశ్న. దీనికి ఇప్పటికిప్పుడు సమాధానం దొరకటం కూడా కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే దేశీయంగా నెలకొన్న పరిస్థితులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు అంశాలు మార్కెట్ పై ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ లు యుద్ధం మొదలుపెట్టి ఏడు నెలలు దాటినా కూడా అమెరికా అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. దీంతో పశ్చిమాసియాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. దీంతో గత కొన్ని నెలలుగా పెరుగుతూపోతున్న క్రూడ్ ధరల కారణంగా మార్కెట్ భారీ ఎత్తున నష్టపోవాల్సి వస్తోంది. పెరిగిన ఆయిల్ ధరలతో ఇప్పటికే దేశంలో నిత్యావసర వస్తువులతో పాటు అన్ని రకాల ధరలు పెరిగాయి. వీటికి తోడు ఇప్పుడు ఆర్ బిఐ తాజాగా రేపో రేట్ ను 25 బేసిస్ పాయింట్లు పెంచటంతో గృహ రుణాలతో పాటు వాహన రుణాలు కూడా భారం కానున్నాయి. మార్కెట్ అంచనా వేసిన దానికంటే ఆర్ బిఐ వడ్డీ రేట్ల పెంపును 25 బేసిస్ పాయింట్స్ కే పరిమితం చేసినా కూడా రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన చర్యలు తప్పవు అని ఆర్ బి ఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.

దీంతో రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి...ఈ రేట్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఏ మాత్రం లేదు అని తేలిపోయింది. మరో వైపు అమెరికా బాండ్ మార్కెట్ ప్రతిఫలాలు ఎక్కువగా ఉండటంతో దేశీయ మార్కెట్ నుంచి ఎఫ్ఐఐ లతో పాటు ఎఫ్ పీఐ లు కూడా పెద్ద ఎత్తున తమ పెట్టుబడులను ఉపసంరించుకుంటున్నారు. మరో వైపు ఏఐ భయాలు కూడా మార్కెట్ ను ముఖ్యంగా ఐటి రంగాన్ని వెంటాడుతున్నాయి. ఎల్ నినో కారణంగా ఈ ఏడాది వర్షపాతం భారీగా తగ్గుముఖం పట్టింది. దీంతో వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గుముఖం పడుతుంది అనే అంచనాలు కూడా మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ తరుణంలో గురువారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్ లో భారీ పతనం నమోదు అయింది.

బిఎస్ఈ సెన్సెక్స్ 1045 నష్టపోయి 71593 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో బిఎస్ఈ లో నమోదిత కంపెనీల షేర్ల విలువ ఒక్క రోజే 10 లక్షల కోట్ల రూపాయల మేర తుడిచిపెట్టుపోయింది. గురువారం మార్కెట్ ప్రారంభం నుంచి నష్టాలతోనే కొనసాగింది. మధ్యలో అమ్మకాలు ఒత్తిడి మరింత పెరిగి భారీ నష్టాలు నమోదు అయ్యాయి. ముఖ్యంగా అమెరికా -ఇరాన్ యుద్ధం ముగిసి ఇంధన ధరల్లో స్థిరత్వం రావటం...ఎఫ్ఐఐ లు భారత్ మార్కెట్ ల వైపు చూసేలా కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకోవటం...కార్పొరేట్ కంపెనీల రెండవ త్రైమాసిక ఫలితాలు తదితర అంశాలే రాబోయే రోజుల్లో మార్కెట్ దిశ, దశను నిర్ణయించనున్నాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే అమెరికా, ఇరాన్ ల యుద్ధ అనిశ్చితి మరింత కాలం కొనసాగితే ఇంధన ధరల పెరుగుదల కారణంగా దేశీయ ఆర్థిక వ్యవస్థ పై మరింత ప్రతికూల ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే మరి కొన్ని రోజులు మార్కెట్ తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది అని స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story
Share it