స్టాక్ మార్కెట్ దూకుడు
దేశీయ మార్కెట్లు బుధవారం నాడు కూడా దూకుడు చూపించాయి. మార్కెట్ ప్రారంభం నుంచి చివరి వరకూ ఇదే ట్రెండ్ కొనసాగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బీఐ) పరపతి సమీక్షలో ఎలాంటి మార్పులు చేయకపోవటం కలిసొచ్చింది. మంగళవారం నాడు కూడా లాభాలతో ముగిసిన మార్కెట్ బుధవారం నాడు ఏకంగా 1016 పాయింట్లు మేర లాభపడింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందటం కూడా మార్కెట్ కు కలిసొచ్చాయి.
ముఖ్యంగా కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ తో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డబ్ల్యూహెచ్ వోతోపాటు అమెరికాకు చెందిన ప్రముఖ నిపుణుడు అంటోనీ పౌచీ వెల్లడించటంతో భయాలు తొలిగాయి. అయితే ఒమిక్రాన్ విషయంలో పూర్తి సమాచారం కోసం ఇంకా కొంత కాలం వేచిచూడాల్సిందేనని వీరు స్పష్టం చేశారు. కీలక షేర్లు అన్నీ లాభపడ్డాయి. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ తోపాటు ఎస్ బిఐ వంటి షేర్లు ఉన్నాయి.