Telugu Gateway
Top Stories

హైద‌రాబాద్-బెంగుళూరుల‌ మ‌ధ్య‌ హైస్పీడ్ రైల్వే ట్రాక్!

హైద‌రాబాద్-బెంగుళూరుల‌ మ‌ధ్య‌ హైస్పీడ్ రైల్వే ట్రాక్!
X

దేశ ఐటి రంగానికి అత్యంత కీల‌క‌మైన న‌గ‌రాలు బెంగుళూరు, హైద‌రాబాద్. ఈ రెండు కీలక‌ న‌గ‌రాల మ‌ధ్య దూరాన్ని త‌గ్గించేందుకు రైల్వే శాఖ కీల‌క ప్రతిపాదన చేసింది. దీని కోసం సెమీ హై స్పీడ్ రైల్వే ట్రాక్ ను డెవ‌ల‌ప్ చేయాల‌ని ప్ర‌తిపాదించారు. ఇది పూర్త‌యితే రైలులో కేవ‌లం రెండున్న‌ర గంట‌ల్లో బెంగుళూరు నుంచి హైద‌రాబాద్ చేరుకోవ‌చ్చు. ఈ రెండు న‌గ‌రాల మ‌ధ్య హైస్పీడ్ ట్రాక్ ఏర్పాటుకు రైల్వే శాఖ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌ధాన మంత్రి గ‌తిశ‌క్తి స్కీమ్ కింద ఈ ప్ర‌తిపాద‌న తెర‌పైకి తీసుకొచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ ప్రాజెక్టు పూర్త‌య్యేందుకు 30 వేల కోట్ల రూపాయ‌ల వ్య‌యం అవుతుంద‌ని అంచ‌నా. ప్ర‌తిపాదిత సెమీ హై స్పీడ్ రైల్వే ట్రాక్ పూర్త‌యితే ఈ మార్గంలో రైలు గంట‌కు 200 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణించ‌గ‌ల‌దని అంచ‌నా.

ఈ సెమీ హైస్పీడ్ రైల్వే ట్రాక్ ను బెంగుళూరులోని య‌ల‌హంక స్టేష‌న్ నుంచి హైద‌రాబాద్ లోని సికింద్రాబాద్ స్టేష‌న్ ల మ‌ధ్య ఏర్పాటు చేస్తారు. వీటి మ‌ధ్య దూరం 503 కిలోమీట‌ర్లు ఉంటుంది. ఈ హై స్పీడ్ రైల్వే ట్రాక్ రెండు వైపుల కూడా 1.5 మీట‌ర్ల ఎత్తుతో గోడ కూడా నిర్మించ‌నున్నారు. మ‌ధ్య‌లో ఎలాంటి అవాంత‌రాలు లేకుండా చేసేందుకే ఈ గోడ ప్ర‌తిపాద‌న తెర‌పైకి తెచ్చారు. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న మౌలిక స‌దుపాయాల ప్ర‌కారం హైద‌రాబాద్-బెంగుళూరుల మ‌ధ్య ప్ర‌యాణ స‌మ‌యం ప‌ది నుంచి ప‌ద‌కొండు గంట‌లు ప‌డుతుంది. అయితే ప్ర‌తిపాదిత సెమీ హై స్పీడ్ రైల్వే ట్రాక్ ప‌నులు ఎప్పుడు ప్రారంభం అవుతాయి..ఎప్ప‌టికి పూర్త‌వుతాయి అనే అంశంపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

Next Story
Share it