కోవిషీల్డ్ కు నిపుణుల కమిటీ ఓకే
ముందు నుంచి అనుకుంటున్నదే అయినా ఓ శుభవార్త. నూతన సంవత్సరం తొలి రోజు కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి కీలక పరిణామం. కేంద్ర డ్రగ్ ప్రామాణిక నియంత్రణా సంస్థ (సీడీఎస్ సీవో) కి చెందిన నిపుణుల కమిటీ శుక్రవారం నాడు సమావేశం అయి సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)కి కు చెందిన 'కోవిషీల్డ్' వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సిఫారసు చేసింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు ప్రతిపాదనలు పంపింది. డీసీజీఐ అనుమతి రావటమే తరువాయి దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. అయితే కొన్ని పరిమితుల మధ్యే ఇది సాగనుంది. ఈ వ్యాక్సిన్ ను ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.
భారత్ లో ఎస్ఐఐ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించటంతోపాటు..ఇప్పటికే కొన్ని కోట్ల డోసుల ఉత్పత్తిని కూడా సిద్ధం చేసింది. ఖచ్చితంగా కోవిషీల్డ్ సక్సెస్ అవుతుందనే అంచనాతో రిస్క్ చేసి మరీ ఎస్ఐఐ ఉత్పత్తి చేసింది. దేశీయ అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు అయిన సీరమ్ 30 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను సిద్ధం చేస్తోంది. భారత్‌లో 10 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను వినియోగించను న్నామని సీరం ఇప్పటికే ప్రకటించింది.మరో పక్క దేశంలో యూకేకు చెందిన కొత్త కరోనా వేరియంట్ స్ట్రెయిన్ ఉనికి ఆందోళన రేపుతోంది. తాజాగా నాలుగు కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కొత్త వైరస్ బాధితుల సంఖ్య 29కి చేరింది. అటు కొత్త వేరియంట్‌ను కూడా ఎదుర్కొనే సామర్ధ్యం తమ టీకాకు ఉందని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది.