రిలయన్స్ కు సెబి ఝలక్
దేశంలోని అగ్రశ్రేణి సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కు మార్కెట్ నియంత్రణా సంస్థ అయిన సెబీ ఝలక్ ఇచ్చింది. నిబంధనలను ఉల్లంఘించి అత్యంత సున్నిత సమాచారాన్ని మార్కెట్ నియంత్రణా సంస్థకు తెలియజేయటంలో జాప్యం చేసినందున కంపెనీతోపాటు..అందుకు బాధ్యులైన ఇద్దరు అధికారులకూ కలిపి 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఏ లిస్టెడ్ కంపెనీ అయినా షేరు ధరల్లో మార్పులకు కారణం అయ్యే కీలక సమాచారాన్ని ముందుగానే మార్కెట్ నియంత్రణా సంస్థ అయిన సెబికీ తెలియజేయాల్సి ఉంటుంది. కానీ అత్యంత కీలకమైన జియో-ఫేస్ బుక్ డీల్ విషయంలో పత్రికల్లో వార్తలు వచ్చిన తర్వాత కూడా రిలయన్స్ సెబీకి వివరాలు తెలియజేయలేదు. సెబీ జరిమానా విధించటానికి ఇప్పుడు అదే కారణం అయింది. సెబీ తాజాగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ జరిమానాను 45 రోజుల్లోగా సంయుక్తంగా, లేదా వేర్వేరుగా చెల్లించాలని పేర్కొంది. జియో-ఫేస్‌బుక్ డీల్‌కు సంబంధించిన వార్తలు 2020 మార్చి 24, 25 తేదీల్లో మీడియాలో వెలువడ్డాయని తెలిపింది. రిలయన్స్ జియోలో 9.99 శాతం వాటా విక్రయం ద్వారా ఫేస్‌బుక్ నుంచి రిలయన్స్ 43,574 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మీడియాకు విడుదల చేసిన తరువాత కూడా ఇవ్వలేదనీ, రెగ్యులేటరీ సెబీకి సమాచారం అందించాల్సిన బాధ్యత ఉందని రిలయన్స్‌పై ఉందని సెబీ పేర్కొంది. ఆలస్యంగా 2020 ఏప్రిల్22న ఎక్స్ఛేంజీలకు అందించిందనీ తెలిపింది. ఈ 28 రోజుల ఆలస్యానికి జరిమానా విధించామని సెబీ అధికారి బర్నాలీ ముఖర్జీ తన ఉత్తర్వులో తెలిపారు.ఈ వార్తలతో రిలయన్స్ షేరు మంగళవారం మార్కెట్ ప్రారంభంలో నష్టపోయింది. తర్వాత మళ్లీ లాభాల బాటలో వచ్చింది. అయితే ఈ జరిమానా అంశంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.