అదానీ గ్రూప్ కంపెనీలపై సెబీ విచారణ
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేసింది. అదానీ గ్రూప్ కంపెనీలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబి) విచారణ జరుపుతుందని ప్రకటించింది. ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయాన్ని పార్లమెంట్ లో వెల్లడించారు. అదానీ గ్రూప్ కంపెనీలు సెబీ నియమ, నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అనే అంశంపై విచారణ సాగుతుందన్నారు. అయితే అదానీ గ్రూపు కంపెనీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఎలాంటి విచారణ చేయటంలేదని స్పష్టం చేశారు. అదానీ గ్రూపు కంపెనీల్లోని విదేశీ పోర్ట్ పోలియో పెట్టబడులకు సంబంధించిన అంశం డైనమిక్ గా ఉంటుందని తెలిపారు. గతంలో కూడా అదానీ గ్రూపు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన మూడు ఎఫ్ ఐపిల ఖాతాలను సెబీ స్తంభింపచేసిందని వార్తలు వచ్చిన తరుణంలో ఈ గ్రూప్ షేర్లు కుప్పకూలిన విషయం తెలిసిందే.
ఎఫ్ ఐపిలు కెవైసీ నిబందనలు పాటించనందునే సెబీ అప్పట్లో చర్యలకు దిగినట్లు సమాచారం. అయితే కొద్ది రోజుల క్రితం ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఇది కేవలం బాధ్యతారహిత,నిర్లక్ష్యపూరిత రిపోర్టింగ్ వల్ల వచ్చిన సమస్య అంటూ వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు స్వయంగా కేంద్ర మంత్రి సెబీ అదానీ గ్రూపు కంపెనీలపై విచారణ జరుపుతుందని ప్రకటించటంతో అదానీ గ్రూపు చిక్కుల్లో పడినట్లు అయింది. సెబీ వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటుందా? లేక మీడియా రిపోర్టింగ్ మీద ఆధారపడి విచారణ జరుపుతుందా అన్న దానిపై అదానీ గ్రూప్ స్పందించాల్సి ఉంది. కేంద్ర మంత్రి ప్రకటనలో సోమవారం నాడు అదానీ గ్రూప్ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురై నష్టాలతో ముగిశాయి.