Telugu Gateway
Top Stories

భారీ నష్టాలు ప్రకటించినా..!

భారీ నష్టాలు ప్రకటించినా..!
X

గత కొంత కాలంగా ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించిన ఓలా షేర్లు రికవరీ బాట పట్టాయి. గత ఏడాది ఆగస్ట్ లో ఐపీఓ కి వచ్చిన ఈ కంపెనీ 76 రూపాయల ధరతో షేర్లు జారీ చేసింది. స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన తర్వాత చాలా రోజుల పాటు ఈ షేర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ షేర్ల ధర 157 రూపాయల గరిష్ట స్థాయిని తాకాయి కూడా . తర్వాత రకరకాల కారణాలతో ఓలా షేర్లు పతనం అవుతూ వచ్చాయి. చివరకు 40 రూపాయల దిగువకు కూడా పడిపోయాయి. సోమవారం నాడు అంటే జులై 14 న మాత్రం చాలా రోజుల తర్వాత ఓలా షేర్లలో భారీ ర్యాలీ వచ్చింది. దీనికి కారణం కంపెనీ ప్రకటించిన ఫలితాలే . కంపెనీ భారీ నష్టాలనే ప్రకటించినా కూడా భవిష్యత్ అంచనాలు ఆశాజనకంగా ఉండంతో ఇన్వెస్టర్లు తక్కువ ధర వద్ద ట్రేడ్ అవుతున్న ఓలా షేర్ల పై ఆసక్తి చూపించినట్లు కనిపిస్తోంది. అందుకే ఇవి సోమవారం నాడు ఏకంగా ఏడు రూపాయలకు పైగా లాభంతో 47 రూపాయల వద్ద ముగిశాయి.

ఒక్క బిఎస్ఈ లోనే 8 .38 కోట్ల షేర్లు ట్రేడ్ అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల కాలంతో పోలిస్తే...ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలో కంపెనీ అమ్మకాలు పెరగటం...నష్టాలు తగ్గటం ఓలా షేర్లలో ర్యాలీ కి కారణంగా చెప్పొచ్చు. అయితే అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మాత్రం అమ్మకాలు తగ్గటంతో పాటు...నష్టాలు కూడా పెరిగాయి. ప్రాజెక్ట్ లక్ష్యలో భాగంగా ఖర్చులు తగ్గించుకోవటంతో పాటు కంపెనీ పని తీరు మెరుగుపర్చేందుకు చేపట్టిన పలు చర్యలు ఫలితాన్ని ఇచ్చినట్లు కంపెనీ చెపుతోంది. నెలవారీ నిర్వహణ ఖర్చులను 178 కోట్ల రూపాయల నుంచి 105 కోట్ల రూపాయలకు తగ్గించుకోగలిగింది. త్వరలోనే లాభదాయకతవైపు అడుగులు వేస్తామని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. 2025 జూన్ తో ముగిసిన మూడు నెలల కాలానికి కంపెనీ 428 కోట్ల రూపాయల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో నష్టం 347 కోట్ల రూపాయలుగా ఉంది. ఇదే సమయంలో ఆదాయం 1644 కోట్ల రూపాయల నుంచి 828 కోట్ల రూపాయలకు తగ్గింది.

Next Story
Share it