హైదరాబాద్ కు వచ్చిన మ్రియా..ఇప్పుడు మాయం
రష్యా సేనల చేతిలో ధ్వంసమైన ప్రపంచంలోని అతిపెద్ద విమానం
రష్యా-ఉక్రెయిన్ పోరులో భారీ ఎత్తున ప్రాణ నష్టమే కాదు..ఆస్తి నష్టం కూడా జరుగుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద విమానం అయిన యాంటోనోవ్ ఎన్ 225 విమానాన్ని రష్యా సేనలు ధ్వంసం చేశాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ విదేశీ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ విమానాన్ని ధ్వంసం చేయవచ్చుకానీ..బలంగా..స్వేచ్చాయుతంగా ఉండాలన్న తమ కలను ఎప్పటికీ ధ్వంసం చేయలేరని అంటూ విదేశాంగ మంత్రి డెమోత్రో కులేబా ట్వీట్ చేశారు. ధ్వంసం అయిన ప్రపంచంలోని అతి పెద్ద విమానాన్ని తాము పునర్ నిర్మిస్తామని పేర్కొన్నారు. రష్యా ధ్వంసం చేసిన ఈ అతి పెద్ద కార్గో విమానం అయిన మ్రియా ఖరీదు మూడు బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఈ విమానంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
84 మీటర్ల పొడవుగా ఉండే ఈ విమానం 250 టన్నుల కార్గోను గంటకు 850 కిలోమీటర్ల వేగంతో రవాణ చేయగలదు. ఈ విమానం 2016 మేలో శంషాబాద్ లోని జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ఓ సారి ల్యాండ్ అయింది. చాలా మంది దీన్ని చూసేందుకు అప్పట్లో క్యూకట్టారు. రష్యా ఓ వైపు చర్చలు జపం చేస్తూనే ఉక్రెయిన్ పై తన దాడులు కొనసాగిస్తోంది. అయితే అత్యంత శక్తివంతమైన రష్యా సేనలను ఉక్రెయిన్ మాత్రం ఏ మాత్రం వెరవకుండా ఎదుర్కొంటోంది. ప్రజలు సైతం ఆయుధాలు చేతపట్టుకుని కదనరంగంలోకి దిగుతుండటంతో రష్యన్ సేనలకు చుక్కులు కన్పిస్తున్నాయి. అగ్రరాజ్యాల నుంచి ఆశించిన స్థాయి దక్కపోయినా ఉక్రెయిన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గటంలేదు.