Telugu Gateway
Top Stories

డీజీసిఏ నివేదికలో సంచలన విషయాలు

డీజీసిఏ నివేదికలో సంచలన విషయాలు
X

ఒక ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయటం. తర్వాత అంతా మర్చిపోవటం. దేశంలో ఇది ఎప్పటి నుంచో ఉన్న విధానమే. అంతే తప్ప ముందే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం..ఎయిర్ లైన్స్, ఎయిర్ పోర్ట్ ఆపరేటర్స్ సరిగా భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా?. నిబంధనలు అనుసరిస్తున్నారా లేదా అన్నది తనిఖీ చేసే వ్యవస్థలు అంతగా లేవు అనే చెప్పాలి. దేశంలోని విమానాల్లోనే కాదు ..విమానాశ్రయాల్లో పెద్ద ఎత్తున భద్రతా వైఫల్యాలు ఉన్నట్లు విమానయాన నియంత్రణా సంస్థ అయిన డైరెక్టర్ జనరల్ అఫ్ ఏవియేషన్ (డీజీసిఏ) నిగ్గుతేల్చింది. అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన దారుణ ప్రమాదం తర్వాత డీజీసిఏ దేశంలోని మొత్తం ఏవియేషన్ ఎకో సిస్టంపై తనిఖీలు నిర్వహించగా ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో తనిఖీలు నిర్వహించగా ఇందులోనే పలు అంశాలు బహిర్గతం అయ్యాయి. విమానాశ్రయంలోని మౌలిక వసతులతో పాటు సిమ్యులేటర్ ట్రైనింగ్ లో కూడా లోపాలు ఉన్నట్లు గుర్తించారు.

డీజీసిఏ మంగళవారం నాడు విడుదల చేసిన నివేదికలో పలు కీలక అంశాలు ఉన్నాయి. మొత్తం వ్యవస్థలో కాలం చెల్లిన డేటా ఉండటంతో పాటు ఎన్నో విధానపరమైన ఉల్లంఘనలు, లోపాలను కనిపెట్టే వ్యవస్థ ఏ మాత్రం సమర్ధవంతంగా లేకపోవటం వంటివి ఎన్నో ఉన్నాయి. వారం రోజుల్లోగా పరిస్థితిని సరిదిద్దాలని ఆపరేటర్స్ ను ఆదేశించినట్లు తెలిపారు. భద్రతా పరమైన సమస్యలను గుర్తించి...వాటిని తొలగించేందుకు చర్యలు కొనసాగించనున్నట్లు డీజీసిఏ వెల్లడించింది. షాకింగ్ విషయం ఏమిటి అంటే ఒక చోట విమానానికి అరిగిపోయిన టైర్లు ఉన్నట్లు కూడా గుర్తించారు.

ఇదే కారణంతో ఈ విమానం బయలు దేరటంలో కూడా జాప్యం జరిగింది. తర్వాత వీటిని సరిచేసిన తర్వాత విమానం బయలుదేరటానికి అనుమతి ఇచ్చారు. ఒక చోట ఉన్న సిమ్యులేటర్ ఒకటి ...ఆ విమానంలో ఉండే కాన్ఫిగరేషన్ మరొకటి అని గుర్తించారు. ఇవే కాకుండా నిర్వహణ కు చెందిన డాక్యుమెంటేషన్ ఏ మాత్రం సరిగా లేకపోగా...భద్రతా చర్యలను కూడా విస్మరించినట్లు గుర్తించారు. ఒక విమానాశ్రయంలో రన్ వే మార్కింగ్ కూడా సరిగాలేదు అని నివేదికలో ప్రస్తావించారు. వీటితో పాటు పలు సాంకేతిక అంశాలను ఈ నివేదికలో పేర్కొన్నారు. ఇది అంతా చూసిన వాళ్ళు విమాన నియంత్రణా సంస్థ అయిన డీజీసిఏ ఇంత దారుణ ప్రమాదం జరిగిన తర్వాత కానీ దేశంలో విమానాశ్రయాలు..విమానాల్లో భద్రతా ప్రమాణాలను పట్టించుకోదా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Next Story
Share it