చరిత్ర సృష్టించిన రోల్స్ రాయిస్
రోల్స్ రాయిస్. ఈ కారు పేరు తెలియని వారుండరు. అత్యంత విలాసవంతతమైన కార్లలో ఇది ముందు వరసలో ఉంటుంది. బారత్ లో ఈ కారు బేసిక్ ధర ఐదు కోట్ల రూపాయలు. ఆ తర్వాత ఇక ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. విశేషం ఏమిటంటే ప్రపంచం అంతా గత రెండేళ్ల నుంచి కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా ఎక్కువగా నష్టపోయింది పేదలు..మధ్య తరగతి ప్రజలు. సంపన్నులకు అసలు కరోనా ఉన్నా ఏమి ఉన్నా ఏమీ కాదు. ఈ కరోనా సమయంలోనే దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామిక సంస్థలు అయిన అంబానీ, అదానీల సంపద కూడా గతంలో ఎన్నడూలేని రీతిలో పెరిగిన విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణం కరోనా సమయంలో స్టాక్ మార్కెట్లు దూసుకుపోవటం కూడా ఒకటి. ఇది అంతా ఎందుకంటే గత ఏడాది రోల్స్ రాయిస్ తన 117 సంవత్సరాల చరిత్రలో అత్యధిక అమ్మకాలు సాధించింది.
అదీ విశేషం. అంటే కరోనా కష్టకాలంలోనూ సంపన్నులు తమ కోరికల నుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదనటానికి ఇదో ఉదాహరణగా నిలుస్తోంది. గత ఏడాది అంతర్జాతీయంగా రోల్స్ రాయిస్ 5586 కార్లను విక్రయించింది. 2020 సంవత్సరం కంటే ఇది 49 శాతం అధికం. చైనా, అమెరికాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ తమ మోడల్స్ దుమ్మురేపాయని కంపెనీ తాజాగా వెల్లడించింది. అసాధారణ డిమాండ్ ను తాము చూశామని రోల్స్ రాయిస్ ప్రతినిధి తెలిపారు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎత్తున ప్రయాణ ఆంక్షలు విధించటంతో సంపన్నులు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేశారు. రోల్స్ రాయిస్ కూడా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. 2023 సంవత్సరం చివరి నాటికి ఈ సంస్థ నుంచి ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి రానున్నాయి.