Telugu Gateway
Top Stories

విదేశాల్లోనూ జియో సేవలు

విదేశాల్లోనూ జియో సేవలు
X

వచ్చే ఏడాది దేశ చరిత్రలోనే అతి పెద్ద ఐపీఓ మార్కెట్ లోకి రానుంది. ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డు లను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఐపీఓ బ్రేక్ చేయనుంది. దేశంలో అతి పెద్ద పబ్లిక్ ఇష్యూ అంటే గత ఏడాది మార్కెట్ లోకి వచ్చిన హ్యుండయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ దే. ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ నుంచి 27858 కోట్ల రూపాయలు సమీకరించింది. 2022 లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) కూడా 21008 కోట్ల రూపాయలు ఐపీఓ ద్వారా సమీకరించింది. ఇప్పుడు ఈ రికార్డు లు అన్ని మాయం కాబోతున్నాయి. ఎందుకంటే ఊహించినట్లే రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ సీఎండీ ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ఐపీఓ పై ప్రకటన చేశారు. రిలయన్స్ ఇన్వెస్టర్లతో పాటు మార్కెట్ వర్గాలు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఈ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాయి. రిలయన్స్ జియో ఐపీవో సైజు ఖచ్చితంగా ఏభై వేల కోట్ల రూపాయల పైమాటే ఉంటుంది అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిలయన్స్ జియో ఐపీఓ వచ్చే ఏడాది తొలి ఆరు నెలల కాలంలోనే ఉంటుంది అని ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. పెట్టుబడి దారులకు ఇది ఒక అద్భుత అవకాశంగా ఆయన అభివర్ణించారు.

భారత్ వెలుపల కూడా జియో కార్యకలాపాలను విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2019 రిలయన్స్ ఏజీఎంలోనే ముఖేష్ అంబానీ తమ టెలికాం, రిటైల్ వ్యాపారాలను లిస్ట్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు జియో ఐపీఓ ప్రకటన వెలువడింది. రిలయన్స్ జియో సొంతంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ విభాగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనుంది. రిలయన్స్ జియో కస్టమర్లు 500 మిలియన్స్ అంటే 50 కోట్లు దాటారు అని ముఖేష్ అంబానీ తెలిపారు. ముఖేష్ అంబానీ తన ప్రసంగంలో ఏఐని ఈ యుగంలోని కామధేనుగా అభివర్ణించారు. రిలయన్స్ ఇంధనం, రిటైల్, టెలికాం, వినోద రంగాలలో ఏఐ ని ఇంటిగ్రేట్ చేస్తున్నట్లు చెప్పారు. క్లీన్ ఎనర్జీ, జెనోమిక్స్, ఏఐ లో జరుగుతున్న మార్పులు భవిష్యత్తులో వృద్ధిని నడిపిస్తాయని అన్నారు. ఏఐ కోసం రిలయన్స్ ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనుంది.

ఇందులో మెటా భాగస్వామిగా ఉండనుంది. మరో టెక్ దిగ్గజం గూగుల్ కూడా రిలయన్స్ తో ఏఐ విషయంలో కలిసి పని చేయనుంది. ఈ రెండు కంపెనీలు కూడా గతంలో రిలయన్స్ జియో లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. రిలయన్స్ ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ తన ప్రసంగంలో కస్టమర్ సేవల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కస్టమర్ సేవలు ఒక విభాగం కాదని, అది ఒక వాగ్దానమని అన్నారు. జియో కస్టమర్ అనుభవాన్ని మరింత ఆహ్లాదకరంగా, సంతృప్తికరంగా మార్చేందుకు ప్రతి టచ్‌పాయింట్‌ను పునఃరూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి భారతీయుడిని కనెక్ట్ చేయటమే లక్ష్యంగా మొబైల్, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల ద్వారా అందరికీ కనెక్టివిటీని అందించడం పై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ విభాగంలో జియో స్మార్ట్ హోమ్, జియోటీవీ+, జియో టీవీ ఓఎస్, ఆటోమేషన్‌తో ప్రతి ఇంటిని డిజిటలైజ్ చేయడం, వ్యాపారాల డిజిటలీకరణలో సులభమైన, స్కేలబుల్, సురక్షితమైన ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వ్యాపారాలను డిజిటల్‌గా మార్చడం వంటి ఉన్నాయన్నారు.

Next Story
Share it