రిలయన్స్ జియోకు తగిలిన రైతుల సెగ!
రిలయన్స్ జియోకు రైతు ఉద్యమం సెగ తగులుతోంది. రైతు ఉద్యమం వెరైటీగా కార్పొరేట్స్ వైపు మళ్ళింది. కేంద్రం తాజాగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు అంబానీ, అదానీల కోసమే అంటూ రైతు సంఘాల నేతలు ధ్వజమెత్తుతున్నారు. వారు చెప్పినట్లే కేంద్రం నడుచుకుంటోందని ఆరోపిస్తున్నారు. అందుకే తాజాగా ఢిల్లీలో కొంత మంది రైతు సంఘాల నేతలు రిలయన్స్ జియోతో పాటు ఆ కంపెనీ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కొంత మంది రిలయన్స్ జియోకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే రైతు ఉద్యమం సెగ రిలయన్స్ జియోకు తగులుతోంది. అందుకే తమ పోటీ సంస్థలు అయినా ఎయిర్ టెల్, వోడాఫోన్ లపై ట్రాయ్ కు ఫిర్యాదు చేసింది. జియోకు వ్యతిరేకంగా విషపూరిత ప్రచారానికి అవి దిగాయని, జియో మొబైల్ నంబర్లను తమ నెట్‌వర్క్ లకు పోర్ట్ చేసుకోవడం రైతుల ఆందోళనలకు మద్దతు పలికినట్టు అవుతుందంటూ ప్రచారం నిర్వహిస్తున్నాయని ఆరోపించింది. ఉద్యోగులు, ఏజెంట్లు, రిటైలర్ల ద్వారా అవి ఈ చర్యలకు పూనుకుంటున్నట్టు తెలిపింది.
ఆ రెండు కంపెనీల చర్యలు జియో ఉద్యోగుల భద్రత, రక్షణకు హాని కలిగిస్తాయని, వాటికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాయ్‌ను కోరింది. అయితే జియో ఆరోపణలను ఎయిర్ టెల్, వోడాఫోన్ సంస్థలు తోసిపుచ్చాయి. అయితే జియో మాత్రం ఉత్తరాదినే కాకుండా దేశవ్యాప్తంగా తమకు వ్యతిరేకంగా ఈ ప్రచారాన్ని పోటీ కంపెనీలు సాగిస్తున్నాయని ఆరోపించింది. పెద్ద ఎత్తున పోర్ట్ అభ్యర్థనలు తనకు వస్తున్నాయంటూ.. కస్టమర్లు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా పోర్టింగ్ ప్రచారాన్ని పేర్కొంటున్నారంటూ వివరించింది. జియో ఆధారరహిత ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు భారతీ ఎయిర్‌టెల్ ట్రాయ్‌కు లేఖ రూపంలో తెలియజేసింది. తాము ఎల్లప్పుడూ వ్యాపారాన్ని విలువలతో, పారదర్శకంగా నిర్వహించేందుకే కట్టుబడి ఉన్నట్టు ప్రకటించుకుంది. ఏ మాత్రం వాస్తవం లేని ఆరోపణలుగా వీటిని వొడాఫోన్ ఐడియా పేర్కొంది.