సెప్టెంబర్ 10న మార్కెట్లోకి జియో ఫోన్ నెక్ట్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం అంటే ఎన్నో అంచనాలు. ఆశలు. ఎందుకంటే ఈ సమావేశం సందర్భంగా ప్రతి ఏటా కీలక ప్రకటనలు చేయటం అలవాటు. భారతీయ స్టాక్ మార్కెట్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ది ఆత్యంత కీలక పాత్ర కావటంతో ఈ ప్రకటనపై మార్కెట్ వర్గాలు కూడా అంతే స్థాయిలో ఆసక్తిగా ఎదురుచూస్తాయి. అయితే ఈ సారి ఏజీఎం ప్రకటనలు స్టాక్ మార్కెట్ లో రిలయన్స్ షేరును ప్రభావితం చేయలేకపోయాయి. అంతే కాదు..గురువారం నాడు రిలయన్స్ షేరు ఏకంగా 51.75 రూపాయల మేర నష్టపోయి 2153 రూపాయల వద్ద ముగిసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగానే రిలయన్స్ బోర్డులోకి సౌదీ అరామ్ కో ఛైర్మన్ యాసిర్ అల్ రుమయాన్ కు చోటు కల్పిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబాని ప్రకటించారు. అంతే కాదు..దీంతో రిలయన్స్ ప్రపంచీకరణకు ఇది తొలి అడుగుగా మారుతుందని పేర్కొన్నారు. భవిష్యత్ లో ఈ దిశగా ప్రకటనలు ఉంటాయన్నారు.
ఇదిలా ఉంటే ఏజీఎం సందర్భంగా ప్రపంచంలో 'అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్' జియోఫోన్ నెక్ట్స్ ను ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. గూగుల్ భాగస్వామ్యంతో ఈ కొత్త ఫోన్ ను అభివృద్ధి చేసినట్లు రిలయన్స్ 44వ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ తెలిపారు. గత ఏడాది గూగుల్ జియోలో రూ.33,737 కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ టెక్ దిగ్గజానికి జియోలో 7.7 శాతం వాటా లభించింది. ప్రపంచ అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ ను సెప్టెంబర్ 10 గణేష్ చతుర్థి రోజున మార్కెట్లోకి తెస్తున్నట్లు సంస్థ పేర్కొంది. జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. దీనిలో వాయిస్ అసిస్టెంట్, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ పనిచేయనున్న కెమెరా, లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ వంటి మరెన్నో ఫీచర్స్ తో వచ్చింది. దీనిని మొదట భారతదేశంలో ప్రారంభించనున్నారు.
తర్వాత ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. దీని ధర ఎంత అనేది సంస్థ ఇంకా ప్రకటించలేదు. రిలయన్స్ జియోకు దేశంలో 425 మిలియన్లకు పైగా చందాదారులు ఉన్నారు. భారతదేశంలో డేటా వినియోగంలో కంపెనీ 45% వృద్ధిని నమోదు చేసింది. త్వరలో 200 మిలియన్ల కొత్త వినియోగదారులు చెరనున్నట్లు రిలయన్స్ జియో భావిస్తుంది. దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది 2జీ ఫోన్ నే వాడుతున్నారు. వారిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్ తీసుకొచ్చినట్లు జియో తెలిపింది. రిలయన్స్ రిటైల్ శరవేగంగా ముందుకెళుతుందని రాబోయే ఐదేళ్ళలో ఇది మరింత దూకుడుగా ఉంటుందని వెల్లడించారు. కరోనా సమయంలోనూ ఈ విభాగంలో కొత్తగా 65 వేల కొత్త ఉద్యోగాలు కల్పించామన్నారు.