Telugu Gateway
Top Stories

రెండువేల రూపాయల నోట్ల ఉపసంహరణ

రెండువేల రూపాయల నోట్ల ఉపసంహరణ
X

సంచలన నిర్ణయం. రిజర్వు బ్యాంకు ఇండియా (ఆర్ బీఐ ) శుక్రవారం సాయంత్రం సంచలన ప్రకటన చేసింది. రెండు వేల కోట్ల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంది. ఇప్పటికే ఇవి సామాన్య, మధ్య తరగతి ప్రజల నుంచి ఎప్పుడో బయటకి వెళ్లి పోయాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇవి చలామణిలో పెద్దగా కనిపించక చాలా రోజులు అయింది. అయితే ఈ డబ్బు అంతా ఎక్కువగా రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తల చేతుల్లోకి బ్లాక్ మనీ గా వెళ్ళిపోయింది అనే ఆరోపణలు ఉన్నాయి. 2016 లో పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత ఇప్పుడు ఇది మరో సంచలన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఎప్పటినుంచో రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేస్తారనే ప్రచారం ఉంది. ఎప్పటికప్పుడు వీటిని ప్రభుత్వం తోసిపుచ్చుతూ వచ్చింది. ఇప్పుడు వాటిని ఉపసంహరించుకుంది. రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది.

ఈ మేరకు నోట్ల జారీని తక్షణమే నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఆర్ బీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే సెప్టెంబర్ 30, 2023 వరకు ఈ నోట్లు చట్టబద్ధంగానే కొనసాగుతాయి. ఇప్పటికే ఈ నోట్లు ఉన్నవారు సెప్టెంబర్ 30 లోగా బ్యాంకుల వద్ద మార్చుకోవచ్చు. ఈ మేరకు ఆర్ బీఐ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 3 . 52 లక్ష కోట్ల రూపాయలు సర్క్యూలేషన్ లో ఉన్నట్లు అంచనా. క్లీన్ నోట్ పాలసీ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఒక వ్యక్తి ఒకసారి పది నోట్లు మాత్రమే మార్చుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఇది కచ్చితంగా రాజకీయనేతలు...బ్లాక్ మనీ ఉన్న వారికి పెద్ద షాక్ వంటిదే అనే చర్చ సాగుతోంది. వాస్తవానికి ఆర్ బీఐ 2018 నుంచి రెండు వేల రూపాయల నోట్ల ముద్రణ నిలిపివేశారు.

Next Story
Share it