హెచ్ డీఎఫ్ సీకి ఆర్ బిఐ షాక్
ప్రైవేట్ రంగంలోని దిగ్గజ బ్యాంకు హెచ్ డీఎఫ్ సీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) షాకిచ్చింది. వరస పెట్టి బ్యాంక్ ఆన్ లైన్ లావాదేవీల్లో అంతరాయాలు తలెత్తుతుండటంతో కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలికంగా కొత్త క్రెడిట్ కార్డుల జారీని నిలుపుదల చేయాల్సిందిగా కోరింది. డిజిటల్-2లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రవేశపెట్టనున్న అన్ని డిజిటల్ సంబంధ కార్యక్రమాలనూ తాత్కాలికంగా నిలిపివేయవలసిందిగా ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. అందులోనే క్రెడిట్ కార్డుల జారీని కూడా నిలిపివేయాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా లోపాలను సవరించిన వెంటనే ఆర్‌బీఐ విధించిన తాజా ఆంక్షలను ఎత్తి వేయనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతం ఆర్‌బీఐ జారీ చేసిన ఆదేశాలు బ్యాంకు రోజువారీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావమూ చూపవని తెలియజేసింది.
ప్రస్తుత కస్టమర్లకు అన్ని సేవలూ యథావిధిగా అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ప్రైమరీ డేటా సెంటర్‌లో విద్యుత్ ప్రసారంలో వైఫల్యాలు సర్వీసులలో అంతరాయాలకు కారణమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల గత నెల 21న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిజిటల్, ఆన్‌లైన్ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడటంతో ఆర్‌బీఐ వివరాలు దాఖలు చేయమంటూ ఆదేశించింది. గతేడాది డిసెంబర్‌లో తలెత్తిన అంతరాయం కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లు తొలిసారి రెండు రోజులపాటు మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలను పొందలేకపోయారు. గత రెండేళ్లుగా ఐటీ వ్యవస్థల పటిష్టానికి పలు చర్యలు తీసుకున్నట్లు ఈ సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలియజేసింది.