Telugu Gateway
Top Stories

అత్యవసర ఆరోగ్య సంరక్షణ కోసం 50 వేల కోట్లు

అత్యవసర ఆరోగ్య సంరక్షణ కోసం 50 వేల కోట్లు
X

దేశాన్ని కరోనా రెండవ దశ వణికిస్తున్న వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) రంగంలోకి దిగింది. అత్యవసర ఆరోగ్య సంరక్షణ కోసం మూడేళ్ల కాలానికిగాను వన్‌టైం లిక్విడిటీ మద్దతు కింద 50 వేల కోట్ల రూపాయలు అందుబాటులోకి తెచ్చింది. ఈ నిధులను వ్యాక్సిన్ తయారీ సంస్థలతోపాటు దేశ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో మౌలికసదుపాయాల కల్పనకు ఉపయోగించుకోవచ్చు. కరోనా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పలు ప్రకటనలు చేశారు. అందులో ముఖ్యమైనవి..'బ్యాంకులకు కోవిడ్‌ లోన్లు, ప్రయారిటీ సెక్టార్‌గా చిన్న ఫైనాన్స సంస్థలకు గుర్తింపు. సూక్ష్మ, చిన్న ,ఇతర అసంఘటిత రంగ సంస్థలకు మరింత సహకారం. చిన్న ఫైనాన్స్ బ్యాంకుల కోసం ప్రత్యేక దీర్ఘకాలిక రెపో కార్యకలాపాలు. ప్రస్తుత రెపో రేటుకు 10,000 కోట్లు, రుణగ్రహీతకు రూ .10 లక్షల వరకు తాజా రుణాలు. అక్టోబర్ 31,2021 వరకు ఈ సదుపాయం. మార్చి 2022 వరకు ఎన్‌పిఎల కోసం నిర్దిష్ట కేటాయింపులు. ప్రస్తుత సంక్షోభ సమయంలో వీడియో ద్వారా వినియోగదారుల కేవైసీ అప్‌డేట్‌ సౌకర్యం. కేవైపీ అప్‌డేట్‌ కాని యూజర్లపై ప్రస్తుతానికి ఎలాంటి చర్యలుండవు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఓడీ ఉపశమనం.. 36 రోజుల నుంచి 50 రోజులకు గడువు పెంపు ' వంటి నిర్ణయాలు తీసుకున్నారు.

దేశాన్ని కరోనా కుదిపేస్తున్న ఈ తరుణంలో వ్యాపారులతో సహా పరిశ్రమలోని అన్ని వర్గాల వారిని ఆదుకునున్నామని శక్తికాంత్‌ వెల్లడించారు. ఇందులో భాగంగానే కోవిడ్ హెల్త్‌ కేర్ ఇన్‌ఫ్రా వసతులు కల్పించేందుకు రూ.50వేల కోట్ల మేరు నిధులను బ్యాంకుల వద్ద రెపోరేటు వడ్డీతో అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. 588 బిలియన్ డాలర్ల రిజర్వ్ ఫారెక్స్ నిధులు ఉన్నందున ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఇబ్బంది ఉండదన్నారు. 2022 ద్వితీయార్ధానికి అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందని అంచనా వేశారు. మే 20 న రెండోసారి 35 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోళ్లు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందనే అంచనాలతో గ్రామాల్లో డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story
Share it