ఒక్క రోజులోనే రాకేష్ ఝున్ ఝున్ వాలాకు 101 కోట్ల లాభం
స్టాక్ మార్కెట్. చాలా మందికి అర్ధం కాని ఓ పెద్ద పజిల్. కానీ కొంత మందికి మాత్రం ఇది కాసులు కురిపించే మార్గం. అన్ని సార్లు అలాగే ఉంటుందని కాదు. షేర్ల ఎంపికపై ఇది ఆధారపడి ఉంటుంది. అయితే భారతీయ వారెన్ బఫెట్ గా పేరుగాంచిన రాకేష్ ఝున్ ఝున్ వాలాకు మాత్రం స్టాక్ మార్కెట్ నిధుల వర్షం కురిపించే ఓ మార్గం. ఆయన ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టాడో తెలుసుకుని సాధారణ ఇన్వెస్టర్లు కూడా అందులో షేర్లు కొంటారు. అంత నమ్మకం ఆయన టార్గెట్ అంటే. అయితే రాకేష్ ఝున్ ఝున్ వాలా పెట్టుబడి పెట్టిన అన్ని షేర్లు లాభాలు ఇచ్చాయనే చెప్పలేం. కాకపోతే ఆయన ఎంపికలో సక్సెస్ రేటే చాలా ఎక్కువ. అందుకే ఆయన మాట స్టాక్ మార్కెట్ లో అత్యంత కీలకం అవుతుంది. దీపావళి నాడు జరిగే ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ మూరత్ లో ఆయన ఏకంగా 101కోట్ల రూపాయల లాభం గడించారు. అది కూడా ఓ ఐదు షేర్లలోనే. గంట ట్రేడింగ్ జరిగిన మూరత్ లో ఆయనకు ఈ మేర లాభం వచ్చినట్లు ఫైనాన్సియల్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రచురించింది.
ఇండియన్ హోటల్స్ లో ఆయనకు ఉన్న వాటాకు ఆ సెషన్ లో 31 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఈ షేరు ధర ఆరు శాతం మేర లాభపడింది ఆ సెషన్ లో. దీంతోపాటు టాటామోటార్స్, క్రిసిల్ షేర్లలో వరసగా 17.82 కోట్ల రూపాయలు, 21.72 కోట్ల రూపాయల లాభం చవిచూశారు. రాకేష్ కు లాభాలు తెచ్చిపెట్టిన వాటిలో డెల్టా కార్ప్, ఎస్కార్ట్స్ కూడా ఉన్నాయి. రాకేష్ ఝున్ ఝున్ వాలా ఇప్పుడు ఆకాశ పేరుతో దేశీయ ఎయిర్ లైన్స్ ను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరంలో ఈ సర్వీసులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం ఏవియేషన్ రంగానికి వాతావరణం అంత అనుకూలంగా లేకపోయినా భవిష్యత్ లో రంగంలో అవకాశాలు బాగుంటాయనే అంచనాతో ఆయన ఈ రంగంలో పెట్టుబడి పెట్టడానికి రెడీ అయ్యారు.