Telugu Gateway
Top Stories

ఆకాశ ప్రారంభించిన కొద్దిరోజుల‌కే అనంత‌లోకాల‌కు

ఆకాశ ప్రారంభించిన కొద్దిరోజుల‌కే అనంత‌లోకాల‌కు
X

స్టాక్ మార్కెట్లో ఆయ‌న ఏ షేరు పట్టుకుంటే ఆ షేరు లాభాల్లోకి దూసుకెళుతుంది. ఆయ‌న పెట్టుబ‌డి పెట్టిన కంపెనీల‌ను గుర్తించి షేర్లు కొనుగోలు చేసేవారు కూడా ఉన్నారంటే ఏ మాత్రం అతిశ‌యోక్తి కాదు. ఆయ‌న మ‌దుపు చేసిన వాటిలో కొన్ని న‌ష్టాల బాట ప‌ట్టినా కూడా ఓవ‌రాల్ గా చూసుకుంటే స‌క్సెస్ రేటే ఎక్కువ. అందుకే చాలా మంది ఆయన్ను గుడ్డిగా ఫాలో అయ్యేవారు. అందుకే ఆయ‌న్ను వారెన్ బ‌ఫెట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఆయ‌నే రాకేష్ ఝున్ ఝున్ వాలా. కొద్ది రోజుల క్రిత‌మే ఆయ‌న విమాన‌యాన రంగంలోకి అడుగుపెట్టి ఆకాశ ఎయిర్ లైన్స్ ప్రారంభించారు. ఇందులో ఆయ‌న ప్ర‌ధాన వాటాదారుగా ఉన్నారు. ఆకాశ ఎయిర్ లైన్స్ ప్రారంభించిన కొద్ది రోజుల‌కే ఆయ‌న అనంతలోకాల‌కు వెళ్ళారు. చాలా మంది ఈ స‌మ‌యంలో ఎయిర్ లైన్స్ రంగంలోకి అడుగుపెట్ట‌డంపై ప‌లు సందేహాలు వ్య‌క్తం చేసినా ఆయ‌న మాత్రం భార‌త్ లో విమాన‌యాన రంగానికి మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని.. అదే దీమాతో ఇందులోకి అడుగుపెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

రిస్క్ ను అంచ‌నా వేయ‌కుండా కంపెనీ ప్రారంభిస్తానా అంటూ ప్ర‌శ్నించారు. అంతే కాదు..ఖ‌చ్చితంగా ఆకాశ ఎయిర్ లైన్స్ ను లాభాల బాట ప‌ట్టిస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఆగ‌స్టు 7నే ఆకాశ ఎయిర్ లైన్స్ త‌న సేవ‌లు ప్రారంభించిన విష‌యం తెలిసిందే. రాకేష్ ఝున్ ఝున్ వాలా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆదివారం ఉద‌యం 6.45 గంటలకు ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. అయినా ప‌లితం లేకుండా పోయింది. ఆస్ప‌త్రికి తీసుకెళ్ళే స‌మ‌యానికి ఆయ‌న తుది శ్వాస విడిచార‌ని డాక్ట‌ర్లు ప్ర‌క‌టించారు. రాకేష్ ఝున్ ఝున్ వాలా వ‌య‌స్సు 62 సంవ‌త్స‌రాలే. ట్రేడర్‌గా చార్టెడ్‌ అకౌంటెంట్‌గా ఎంతో పేరుగడించిన ఆయన.. భారత్‌లోని అత్యంత సంపన్నుల్లో ఒకరు. ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణంతో పలువురు వ్యాపార వేత్తలు, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.

..

Next Story
Share it