Telugu Gateway
Top Stories

ట్రంప్ పై మోడీ మౌనం వెనక కారణం ఏంటి?!

ట్రంప్ పై మోడీ మౌనం వెనక కారణం ఏంటి?!
X

రష్యా మాట వినటం లేదు అని పదే పదే ఇండియాను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్. ఇండియా రష్యా దగ్గర ఆయిల్ కొనటం తప్పు అనే చెప్పే ట్రంప్...రష్యా కారణంగా దారుణంగా నష్టపోయిన ఉక్రెయిన్ ను బెదిరించి మరీ క్రిటికల్ మినరల్స్ కోసం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు చాలా మందిని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇండియా విషయంలో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారం ప్రకటనలు చేస్తున్నా కూడా ప్రధాని మోడీ నుంచి ఈ విషయంలో పెద్దగా స్పందన ఉండటం లేదు. ఇది దేశంలోని చాలా మందికి పెద్ద పజిల్ గా కూడా మారింది. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ సమయంలో డోనాల్డ్ ట్రంప్ చేసిన కాల్పుల విరమణ ప్రకటన భారత ప్రధాని మోడీ ని తీవ్ర ఇరకాటంలో పడేసింది. రాజకీయంగా కూడా బీజేపీ కి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. యుద్ధం ఆపకపోతే తాము వాణిజ్యం చేయం..వాణిజ్య ఒప్పందాలు ఉండవు అని చెప్పటంతోనే రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి అని డోనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రకటించారు.

భారత్ అధికారికంగా ఈ వాదనను తోసిపుచ్చినా కూడా డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ విషయంలో తన ప్రకటనలను ఏ మాత్రం ఆపటం లేదు. మరో వైపు పార్లమెంట్ లో ఆపరేషన్ సిందూర్ అంశంపై చర్చ జరిగినప్పుడు కూడా కాల్పుల విరమణ విషయంలో వేరే దేశాల జోక్యం లేదు అని ప్రధాని మోడీ ప్రకటించారు తప్ప..అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పింది...చెపుతున్నది తప్పు అని పార్ల మెంట్ వేదికగా చెప్పే సాహసం చేయలేదు. ఇదే అంశంపై ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్ సభ వేదికగా మీకు ఇందిరా గాంధీ దైర్యంలో 50 శాతం ఉన్నా కూడా డోనాల్డ్ ట్రంప్ అబద్దాల కోరు...అతను చెప్పింది తప్పు అని చెప్పాలని డిమాండ్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ తరుణంలో రాహుల్ గాంధీ బుధవారం నాడు మోడీ టార్గెట్ గా ఒక ట్వీట్ చేశారు.

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ భారత్ ను పదే పదే బెదిరించే ధోరణితో మాట్లాడుతున్నప్పటికీ ప్రధాని మోదీ ఆయనను ఎదిరించలేకపోవడానికి కారణం అదానీపై అమెరికాలో సాగుతున్న దర్యాప్తు లే అన్నారు. ఈ విషయాన్ని భారత దేశం అర్ధం చేసుకోవాలి అంటూ రాహుల్ గాంధీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అదే సమయంలో మోడీ, ఏఏ(అదానీ, అంబానీ), రష్యా ఆయిల్ డీల్స్ తో కూడిన ఆర్థిక ఒప్పందాలను బహిర్గతం చేసే అవకాశం ఉంది అన్నారు. మోడీ చేతులు ఇప్పుడు కట్టేసి ఉన్నాయని రాహుల్ గాంధీ తన ట్వీట్ లో ఎద్దేవా చేశారు. వాస్తవానికి అమెరికా-ఇండియా ల మధ్య ట్రేడ్ డీల్ సాఫీగా సాగేందుకు అధికారుల స్థాయిలో పలు సమావేశాలు జరిగాయి. కానీ ఇవి ఒక కొలిక్కి రాకపోవటంతో భారత్ పై డోనాల్డ్ ట్రంప్ ఏకంగా 25 శాతం సుంకాలు విధించటంతో పాటు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు జరిమానా కూడా విధిస్తామని ప్రకటించారు. ఇప్పుడు మరో సారి భారత్ పై సుంకాల బాంబు పేలుస్తాను అని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

Next Story
Share it