Telugu Gateway
Top Stories

ఏడుగురు ఎంపీలు బీజేపీలోకి జంప్

ఏడుగురు ఎంపీలు బీజేపీలోకి జంప్
X

ఢిల్లీ లిక్కర్ కేసు తో అరవింద్ కేజ్రీవాల్ ను రాజకీయంగా దెబ్బకొట్టిన బీజేపీ ఇప్పుడు మరో సారి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ని టార్గెట్ చేసింది. బీజేపీ చేపట్టిన ఈ ఆపరేషన్ విజవంతం అయినట్లే కనిపిస్తోంది. గత కొంత కాలంగా రాజ్య సభలో వివిధ అంశాలను లేవనెత్తడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించిన రాఘవ్ చడ్డా బీజేపీ లో చేరే అవకాశం ఉంది అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది. దీంతో కొద్దిరోజుల క్రితమే ఆప్ అధిష్ఠానం ఆయన్ను రాజ్యసభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తప్పించింది. రాఘవ్ చడ్డా ప్లేసులో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా మరో ఎంపీ అశోక్ మిట్టల్ ను నియమించింది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఈ నియామకం జరిగిన వెంటనే ఆయనపై ఈడీ దాడులు చేసింది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్ పీ యూ) వ్యవస్థాపకుడు అయిన అశోక్ మిట్టల్ కు చెందిన పలు ఆఫీసుల పాటు యూనివర్సిటీ లో కూడా సోదాలు నిర్వహించారు. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం (ఫెమా) నిబంధనలు ఉల్లఘించారు అనే ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి.

ఇప్పుడు రాఘవ్ చడ్డా తో పాటు అశోక్ మిట్టల్ కూడా బీజేపీ లో చేరటానికి సిద్ధం అయ్యారు. వీళ్లిద్దరే కాకుండా రాజ్యసభలో ఉన్న పది మంది ఆప్ ఎంపీల్లో ఏడుగురు బీజేపీ లో చేరటం ద్వారా అనర్హత వేటు నుంచి తప్పించుకోబోతున్నారు. ఇది ఆప్ కు బిగ్ షాక్ లాంటి పరిణామమే అని చెప్పాలి. శుక్రవారం నాడు ఢిల్లీ లో మీడియా తో మాట్లాడిన చడ్డా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మూడింట రెండొంతుల మంది సభ్యులం బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాఘవ్ చడ్డాతో సహా ఏడుగురు ఎంపీలు ఆప్ పార్టీకి రాజీనామా చేశారు. సీనియర్ ఎంపీలు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్‌లతో కలిసి చడ్డా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతిపై పోరాడతామని హామీలతో ఒకప్పుడు ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆప్ విలువలతో కూడిన రాజకీయాలకు దూరమవుతోందని ఆరోపించారు.

బీజేపీలో చేరనున రాజ్యసభ ఎంపీల్లో హర్భజన్ సింగ్, స్వాతి మాలివాల్, సందీప్ పాఠక్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్ని, హర్భజన్ సింగ్ ఉన్నారని చడ్డా వెల్లడించారు. తన జీవితంలోని 15 ఏళ్లను ఆమ్ ఆద్మీ పార్టీ కోసం అంకితం చేశానని, తాను సరైన పార్టీలో ఉన్నట్లు భావించటం లేదు అని...అందుకే ఇప్పుడు ఆప్ కు రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాఘవ్ చడ్డాను ఒక పావుగా వాడి తమ పార్టీలో చీలిక తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్‌ ఆరోపించింది. ఏడుగురు ఎంపీలను తీసుకువస్తే.. మంత్రిని చేస్తామని చడ్డాకు కేంద్రమంత్రి అమిత్‌ షా చెప్పినట్టుగా తమకు సమాచారం ఉందని ఆప్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని బీజేపీ చెపుతోంది. ఏడుగురు ఆప్ ఎంపీలు సంతకాలు చేసిన లేఖను రాజ్యసభ చైర్మన్ కు అందించినట్లు రాఘవ్ చడ్డా వెల్లడించారు. ఉదయం రాజ్యసభ చైర్మన్ కు లేఖ ఇచ్చి..సాయంత్రం ఢిల్లీ లోని బీజేపీ కార్యాలయంలో ఈ ఎంపీలు ఆ పార్టీ లో చేరిపోయారు.

Next Story
Share it