Telugu Gateway
Top Stories

శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు

శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
X

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదంపై రాజకీయ విమర్శలు వినిపిస్తున్న వేళ ఆయన వీటికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరిపించాలని కోరారు. తాను దీన్ని మాత్రమే నమ్ముతాను అని...మిగిలిన వ్యవస్థలు ఏవీ కూడా సరిగా విచారణ జరుపుతాయి అని తాను భావించటం లేదు అన్నారు. కూటమి నుంచి బయటకు వచ్చే ఆలోచనలు అజిత్ పవార్ కు ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అన్నారు ఆమె. ఈ తరుణంలో శరద్ పవార్ మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎలాంటి కుట్రా లేదని, ఇది ఒక ప్రమాదం మాత్రమేనంటూ భావోద్వేగానికి గురయ్యారు. 'ఇందులో ఎలాంటి కుట్ర లేదు. ఇది పూర్తిగా ప్రమాదమే. అజిత్ పవార్ మరణం మహారాష్ట్రకు తీరని లోటు. ఒక సమర్ధుడైన నేత ఈరోజు మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఒక గొప్ప వ్యక్తిని మహారాష్ట్ర కోల్పోయింది. ఆయన లేనిలోటు ఎప్పటికీ భర్తీ కాదు' అని శరద్ పవార్ అన్నారు.

అదే సమయంలో ఏదీ మన చేతిలో లేదని, తాను ఏమీ చేయలేని నిస్సహాయుడినని శరద్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకే కాకుండా మహారాష్ట్ర ప్రజలందరికీ అజిత్ మరణం తీరని లోటని అన్నారు. 'దయజేసి ఈ ఘటనలోకి రాజకీయాలను లాగొద్దు.. అదే నేను చెప్పదలచుకున్నాను' అని పవార్ విజ్ఞప్తి చేశారు. అయితే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రయాణించిన స్పెషల్ ఫైట్ అంతా ఫిట్ గా ఉంది అని...ఇందులో ఎలాంటి సమస్యలు లేవు అని విఎస్ఆర్ ఏవియేషన్ అధినేత వీ కె సింగ్ మీడియా కు వెల్లడించారు. ఈ విమానం పక్కాగా ఫిట్ గా ఉండటంతోనే దీన్ని గ్రౌండ్ చేయలేదు అని...ఎలాంటి సమస్యలు లేని విమానాన్ని ఎందుకు గ్రౌండ్ చేస్తామని ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో ఈ విమానాన్ని నడిపిన పైలట్స్ కు కూడా మంచి అనుభవం ఉంది అని తెలిపారు.

అయితే బారామతి దగ్గర ఈ విమానం ల్యాండ్ అయ్యే సమయంలో విజిబులిటీ చాలా తక్కువగా ఉంది అని..ఇదే ప్రమాదానికి కారణం అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రన్ వే ను గుర్తించటంలో పైలట్స్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి అని...ఈ కారణంగానే ప్రమాదం జరిగినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు వెల్లడించారు. అదే సమయంలో ఈ ఘటనపై పూర్తి పారదర్శకంగా విచారణ జరిపించనున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయమే ముంబై నుంచి బారామతి కు బయలుదేరిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తో పాటు ఇద్దరు పైలట్స్, మంత్రి వ్యక్తిగత సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. 66 సంవత్సరాల వయస్సు ఉన్న అజిత్ పవార్ రాజకీయాల్లో చాలా యాక్టీవ్ గా ఉంటారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఏకంగా ఒక సారి ఎంపీగా,,ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

Next Story
Share it