Telugu Gateway
Top Stories

శ్రీలంక‌లో అదానీ ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు

శ్రీలంక‌లో అదానీ ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు
X

శ్రీలంక‌లో క‌ల‌క‌లం. భార‌త్ కు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త అదానీకి వ్య‌తిరేకంగా అక్క‌డ నిర‌స‌న‌లు పెరిగాయి. ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు వ‌చ్చి అదానీ ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పారు. తాము ఈ ప్రాజెక్టుకు వ్య‌తిరేకం కాద‌ని..అప్ప‌గించిన తీరును మాత్ర‌మే త‌ప్పుప‌డుతున్న‌ట్లు ప్ర‌జ‌లు చెబుతున్నారు. అదానీకి ఎలాంటి టెండ‌ర్ లేకుండా ఈ ప్రాజెక్టు అప్ప‌గించాలంటూ భార‌త ప్ర‌ధాని మోడీ శ్రీలంక ప్రెసిడెంట్ గొటబయ రాజపక్సపై ఒత్తిడి తెచ్చారని ఆ దేశ విద్యుత్ సంస్థ అధినేత ప్ర‌క‌టించటం పెద్ద దుమారం రేపింది. ఆ త‌ర్వాత విద్యుత్ సంస్థ అధినేత త‌న వ్యాఖ్య‌లు వెన‌క్కి తీసుకున్నా..ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నా శ్రీలంక‌లో మాత్రం నిర‌స‌న‌లు ఆగ‌టం లేదు. అయితే ఈ వివాదంపై భార‌త ప్ర‌భుత్వం మాత్రం ఇప్ప‌టివర‌కూ ఎక్క‌డా స్పందించ‌లేదు. తాజాగా శ్రీలంక రాజ‌ధాని కొలంబోలో నిరసనకారులు అదాని గ్రూప్‌కి మన్నార్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌ని ఇ‍వ్వొద్దంటూ రోడ్లపై నిరసనలు చేపట్టారు. భారత ప్రధాని మోదీ, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స చీకటి ఒప్పందంతో అదానీ గ్రూప్‌కి ఇచ్చేయాలనకుంటున్నారంటూ ఆరోపణలు చేశారు. అందుకనే ఎటువంటి పోటీ బిడ్డింగ్‌ ప్రక్రియ జరపకుండా అదానీ గ్రూప్‌కి ఈ ప్రాజెక్ట్‌ని కట్టబెట్టేందుకే ఈ అసంబంధమైన ఒప్పందం చేసుకున్నారంటూ నిరసనకారుల మండిప‌డ్డారు. శ్రీలంకలోని కొంతమంది నినరసకారులు స్టాప్‌ అదానీ అంటూ... సోషల్‌ మీడియా వేదికగా కూడా అదానీ గ్రూప్‌కి వ్యతిరేకంగా నిరసన పిలుపునిచ్చారు.

నిరసన‌కారులు మాట్లాడుతూ..."మేము పునరుత్పాధకతను వ్యతిరేకించడం లేదని స్థిరమైన పర్యావరణం కోసం పాటుపడుతున్నాం . ఇంధన ప్రాజెక్టుల పోటీ బిడ్డింగ్‌ కోరుకుంటున్నాం. ఇప్పటికే ఉన్న చట్టవిరుద్ధ కార్యకలాపాలు, ప్రాజెక్టుల కారణంగా మా దేశ సహజ నిల్వలు క్షీణిస్తున్నాయి. పైగా పర్యావరణానికి ముప్పు కలిగించే చీకటి ఒప్పందాలను మేము అనుమతించలేం. ప్రస్తుతం శ్రీలంక ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, దానికి కచ్చితమైన పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాం. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ అవినీతికి మాత్రం తావివ్వం అని నిరసనకారులు నొక్కి చెప్పారు. ఈ పరిణామాల‌పై అదానీ గ్రూప్‌ ప్రతినిధి మాట్లాడుతూ..."శ్రీలంకలో పెట్టుబడుల పెట్టడంలో మా ఉద్దేశం పొరుగు దేశ అవసరాలను తీర్చడమే కాకుండా బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థ‌గా ఇరు దేశాల మధ్య భాగస్వామ్య సంబంధాలు పెంపొందింప చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేశాం. అయినా ఈ సమస్య శ్రీలంక పార్లమెంట్‌లోనే పరిష్కరింపబడినప్పటికీ... ఇది ఒక పెను వివాదంగా మారడం మమల్ని చాలా నిరాశకు గురిచేసింద‌ని అన్నారు.

Next Story
Share it