Telugu Gateway
Top Stories

హౌసింగ్ మార్కెట్ ట్రెండ్ మారుతోంది

హౌసింగ్ మార్కెట్ ట్రెండ్ మారుతోంది
X

హైదరాబాద్ లాంటి నగరంలో ఒకప్పుడు డబల్ బెడ్ రూమ్ ఇల్లు లేదా అపార్ట్ మెంట్ ఉంటే చాలు అనుకునే వారు చాలా మంది . ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. రీ సేల్ అంశాలతో పాటు పలు కోణాల్లో చాలా మంది ఇప్పుడు త్రీ బెడ్ రూమ్ ఆ పైన ఫోర్ బెడ్ రూమ్స్ అపార్ట్ మెంట్స్ కు వెళుతున్నారు . ముఖ్యంగా మంచి జీతాలు వచ్చే ఐటి ఉద్యోగులే ఈ జాబితాలో ఎక్కువ ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే మధ్యతరగతికి కూడా ఇది సాధ్యం కాని వ్యవహారంగా మారిపోయింది. ఒక మంచి లొకాలిటీలో డబల్ బెడ్ అపార్ట్ మెంట్ కావాలంటేనే ఇప్పుడు కోటి రూపాయల వరకు పెట్టాల్సి వస్తోంది. ఇక త్రీ, ఫోర్ బెడ్ రూమ్స్ అపార్ట్ మెంట్ అంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. కరోనా తర్వాత సంపన్న వర్గాల ఆలోచనల్లో పూర్తి గా మార్పు వచ్చింది. టాప్ ఎండ్ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇప్పుడు ఒక్కో ఫ్లోర్ ను ఒక్కో ఫ్యామిలీ కోసం డిజైన్ చేస్తూ విక్రయాలు సాగిస్తున్నాయి. వీటికి కూడా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. ఈ ఫ్లోర్ లో ఏకంగా ఐదు నుంచి ఆరు వేల చదరపు అడుగులుతో నిర్మిస్తున్నారు. కేవలం ప్రీమియం సెగ్మెంట్ ను టార్గెట్ చేసుకుని పలు కీలక సంస్థలు ఇలాంటి ప్రాజెక్ట్ లను తెర మీదకు తెస్తున్నాయి.

అది కూడా సంపన్నులు ఉండే ప్రాంతాలలోనే ఇలాంటి ప్రాజెక్ట్ లు వెలుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ప్రీమియం ఇళ్లకు గిరాకీ గణనీయంగా పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం డీఎల్ఎఫ్ సంస్థ దేశ రాజధానికి ఢిల్లీ కి సమీపంలోని గుర్గావ్ దగ్గర అర్బోర్ పేరు తో ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేయగా ఒక్కొక్కటి ఏడు కోట్ల రూపాయల విలువ చేసే 1137 ప్రీమియం అపార్ట్ మెంట్ లు కేవలం మూడు అంటే మూడు రోజుల్లో అమ్ముడు అయ్యాయి అంటే పరిస్థి తి ఊహించుకోవచ్చు. తాజాగా వెల్లడైన ఒక నివేదిక కూడా ఖరీదైన ఇళ్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది అని తేల్చింది. ఈ జాబితాలో హైదరాబాద్ కు కూడా చోటు దక్కించుకుంది 2023 సంవత్సరం తొలి మూడు నెలల కాలంలోనే నాలుగు కోట్ల రూపాయలు అంతకు మించి ధర ఉంటే యూనిట్ అమ్మకాలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో గత ఏడాది ఈ అమ్మకాలు కేవలం 50 ఉంటే...ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో ఏకంగా అవి 430 కి పెరిగాయి. ఢిల్లీ, ముంబై ల్లో ఇదే జోష్ ఉండగా, ఒక్క బెంగళూరు లో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా ఉంది. రాబోయే రోజుల్లోనూ ఇదే ట్రెండ్ కోనసాగే అవకాశం ఉంది అని భావిస్తున్నారు.

Next Story
Share it