Telugu Gateway
Top Stories

వ్యాక్సిన్ కు ముంద‌స్తు పేరు న‌మోదు అక్క‌ర్లేదు

వ్యాక్సిన్ కు ముంద‌స్తు పేరు న‌మోదు అక్క‌ర్లేదు
X

క‌రోనా వ్యాక్సినేష‌న్ కు సంబంధించి కేంద్రం కీల‌క మార్పులు చేసింది. ముంద‌స్తు న‌మోదు అవ‌స‌రం లేకుండానే 18 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారు నేరుగా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చు. ఈ మేర‌కు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం నాడు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. చాలా మందికి ముంద‌స్తు న‌మోదు స‌మ‌స్య‌గా మారుతుండ‌టం..దీని వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌నే ఫిర్యాదులు రావ‌టంతో ఈ మేర‌కు మార్పులు చేశారు. వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్ళిన స‌మ‌యంలో కోవిన్ యాప్ లో వివ‌రాలు న‌మోదు చేసి వ్యాక్సిన్ వేస్తారు. తాజాగా చేసిన మార్పుల వివ‌రాల‌ను కేంద్రం అన్ని రాష్ట్రాల‌కు తెలియ‌జేసింది.

కోవిన్ యాప్ లో పేర్లు న‌మోదు చేసుకున్న వారికే వ్యాక్సిన్లు ఇవ్వ‌టం అనే నిబంధ‌న వ‌ల్ల గ్రామీణ ప్రాంతాల్లో అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌నే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కూడా వ్య‌క్తం చేసింది. అస‌లు చాలా ప్రాంతాల‌కు ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం కూడా లేద‌ని కోర్టు వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. కేంద్రం తాజాగా చేసిన మార్పుల‌తో వ్యాక్సినేష‌న్ విధానంలో కాస్త జోరు పెర‌గ‌వ‌చ్చ‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. అయితే ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైనంత మేర వ్యాక్సిన్లు స‌ర‌ఫ‌రా చేయ‌ట‌మే ఇప్పుడు అత్యంత కీల‌కంగా మార‌నుంది.

Next Story
Share it