Telugu Gateway
Top Stories

లక్ష వరకు మరణాలు!

లక్ష వరకు మరణాలు!
X

వెనుజువెలా వణికిపోయింది. వరసగా చోటు చేసుకున్న రెండు భారీ భూకంపాలతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఒక్కసారిగా ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఈ భూకంపాలతో ఏకంగా లక్ష మంది వరకు చనిపోయి ఉంటారు అనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే అధికారికంగా ఈ లెక్కల తేలటానికి చాలా సమయం పడుతుంది. ప్రకృతి సృష్టించిన ఈ విపత్తుతో వెనుజువెలా రాజధానిలోని ప్రభుత్వ అధికారిక భవనాలు చాలా నేలమట్టం అయ్యాయి. జూన్ 24 జాతీయ సెలవు దినం కావటంతో ప్రజలు ఎక్కువ మంది ఇళ్లలోనే ఉన్నారు అని ...మృతుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి ఇది కూడా కారణంగా మారబోతుంది అని చెపుతున్నారు. అమెరికా భూగర్భ శాస్త్ర సర్వే (USGS) ప్రకారం మొదట 7.2 తీవ్రతతో, ఆ తర్వాత 7.5 తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి. ఈ ప్రకంపనలతో రాజధాని కారకస్‌తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోగా, భారీ ఆస్తి నష్టం సంభవించింది. వరుస భూకంపాల కారణంగా 10 వేల నుంచి లక్ష మంది వరకు మరణించి ఉండొచ్చని యూఎస్‌జీఎస్ హెచ్చరించింది.

ఇది భూకంప తీవ్రత, జనసాంద్రత, భవనాల నాణ్యత వంటి అంశాల ఆధారంగా రూపొందించిన ప్రమాద అంచనా అని అధికారులు తెలిపారు. అయితే వెనెజువెలా ప్రభుత్వం మరణాల సంఖ్యను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భూకంపాల కేంద్రం కారకస్‌కు పశ్చిమాన ఉన్న మోరోన్ సమీపంలో నమోదైంది. తక్కువ లోతులో భూకంపాలు సంభవించడంతో ప్రకంపనల తీవ్రత అధికంగా ఉండి, ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, రహదారులు దెబ్బతినడం, కమ్యూనికేషన్ సేవలకు అంతరాయం కలగడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

భూకంప ప్రభావం వెనెజువెలాతో పాటు బ్రెజిల్, కొలంబియా ప్రాంతాల్లో కూడా కనిపించింది. ప్రారంభంలో కరేబియన్ ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, అనంతరం వాటిని ఉపసంహరించారు. వరసగా నమోదు అయిన రెండు భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మళ్ళీ మళ్ళీ ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున దెబ్బతిన్న భవనాల్లోకి వెళ్లవద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. రెండు భారీ భూకంపాల తర్వాత దాదాపు 20 వరకు ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంపాల తీవ్రతకు విమానాశ్రయాలు మొదలుకుని పలు కీలక మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో వెనుజువెలా విమానాశ్రయానికి వచ్చే విమానాలను దారిమళ్లించారు.

Next Story
Share it