కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న ప్రధాని మోడీ
దేశంలో సాధారణ పౌరులకు వ్యాక్సిన్ ప్రారంభం అయిన తొలి రోజే ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ మార్చి 1 నుంచి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 45 సంవత్సరాలు ఉన్న వారు ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే వారికి కూడా ప్రాధాన్యక్రమంలో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ప్రధాని మోడీ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ డోసు తీసుకున్నారు. దీంతో కోవాగ్జిన్ తీసుకున్న తొలి ప్రధాని గా మోడీ నిలిచారు. తాను వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని ప్రధాని ట్విటర్ ద్వారా వెల్లడించారు. దేశాన్ని కరోనా రహితంగా చేసేందుకు అందరూ టీకా తీసుకోవాలంటూ ఈ సందర్బంగా మోదీ పిలుపు నిచ్చారు.
ఎయిమ్స్ టీకా కేంద్రంలో పుదుచ్చేరికి చెందిన సిస్టర్ నివేదా ప్రధాని మోదీకి టీకా ఇచ్చారు. కేరళకు చెందిన మరో సిస్టర్ రోసమ్మ అనిల్ కూడా ప్రధానికి టీకా వేసినప్పుడు అక్కడున్నారు. అయితే ఈ సందర్భంగా సిస్టర్ నివేదా, ప్రధాని మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది. అయితే వ్యాక్సిన్ వేసిన విషయం తనకు తెలియలేదని మోడీ సిస్టర్స్ తో వ్యాఖ్యానించారు. 28 రోజుల తర్వాత ఆయన రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎక్కడి నుండి వచ్చామని అడిగారనీ, తమతో మాట్లాడారని ఆమె వెల్లడించారు. ఇది తనకు ఆశ్చర్యం కలిగించిందని కేరళకు చెందిన నర్సు రోసమ్మ అనిల్ పేర్కొన్నారు. టీకా తీసుకున్న తర్వాత ప్రధాని చాలా సౌకర్యవంతంగా ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు.